
అరటన్ను దున్నను అలవోకగా గాల్లోకి ఎగరేసి..
కెన్యా: గజరాజుకు కోపం వస్తే ఎలా ఉంటుందో కెన్యాలో ఓ వన్యమృగక్షేత్రం కళ్లకు కట్టినట్లు చూపింది. అక్కడ ఒళ్లుగగుర్పొడిచే దృశ్యం కనిపించింది. దాదాపు 500 కేజీల బరువున్న దున్నను ఓ తల్లి ఏనుగు అమాంతం గాల్లోకి ఓ ఆడుకునే బొమ్మలా విసిరేసింది. అనంతరం తన దంతాలతో ఆ దున్న తీవ్రగాయాలపాలై విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచింది. ఈ సన్నివేశాలను తన కెమెరాలో క్లిక్ మనిపించిన ఫొటో గ్రాఫర్ తన జీవితం మొత్తంలో ఇలాంటి దృశ్యం ఇక చూడబోవచ్చని, తన కెమెరాలో బందించలేకపోవచ్చని చెప్పాడంటే ఆ సంఘటన ఎంత భయంకరంగా చోటుచేసుకుందో తెలుసుకోవచ్చు.
కెన్యాలోని మాస్సాయి మరా అనే వన్యమృగ క్షేత్రంలో ఏనుగులు,అడవి బర్రెలు, అడవి దున్నపోతులు, ఇతర క్రూరమృగాలు ఉంటాయి. అవి వాటివాటి రక్షణకు అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో ఆహారంకోసం వెళుతుంటాయి. అయితే, బాగా తినేసిన ఓ దున్నపోతు అక్కడే ఓ చెట్టువద్ద మెళ్లగా కన్నార్పి విశ్రాంతి తీసుకుంటోంది. అదే సమయంలో ఆ వైపుగా తన పిల్లలతో ఓ భారీ తల్లి ఏనుగు వచ్చింది.
ఎంతో ప్రశాంతంగా ఏమాత్రం గంభీరంగా కనిపించకుండా ఆ దున్నపోతు ఉన్న చోటును సమీపించింది. ఈలోగా మేలుకున్న దాన్ని ప్రతిఘటించేలోగానే ఆ భారీ ఏనుగు అమాంతం తన తొండాన్ని 500కేజీల బరువున్న ఆ దున్న పొట్టకిందికి దూర్చి ఒక్కసారిగా గాల్లోకి కొన్ని అడుగుల ఎత్తులోకి విసిరేసింది. దీంతో దాని ఎముకలు మొత్తం విరిగిపోయి తీవ్రంగా గాయపడింది. రక్తం కారుతున్నా వదిలిపెట్టని ఆ ఏనుగు మరోసారి కూడా తన బలాన్ని దానిపై చూపి చనిపోయేలా చేసి వెళ్లిపోయింది.