
12 స్థానాలు ఎగబాకిన భారత్
వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 12 స్థానాలు ఎగబాకింది.
వాషింగ్టన్ : వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. 189 దేశాలకు గానూ భారత్ ప్రస్తుతం 130 స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. గతేడాది 140వ స్థానంలో ఉన్న భారత్ 12 స్థానాలు మెరుగు పరుచుకోవడం ఆ దేశానికి బాగా కలిసొస్తుందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు అన్నారు. ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ 'బిజినెస్ 2016' నిమిత్తం జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ఫలితాలు భారత్లో వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా మారనున్నాయి.
అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఒకటైన భారత్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతుందని ప్రపంచ బ్యాంక్ అధికారి, గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ డైరెక్టర్ లోపేజ్ కార్లోస్ పేర్కొన్నారు. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ పొరుగు దేశాలైన చైనా 84, పాక్ 138 స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నివేదికలో చైనా 90, పాక్ 128 స్థానాల్లో ఉన్న విషయం విదితమే.