పరిశుభ్రతకు మారుపేరు ఆ గ్రామం..!
మేఘాలయ రాష్ట్రం తూర్పు కాశీహిల్స్ కు సమీపంలోని మాలినాంగ్.. ఒకప్పుడు జనసంచారమే అంతగా కనిపించని కుగ్రామం. రోడ్డు సౌకర్యం కూడా లేని ఆ పల్లెకు చేరాలంటే కొండ కోనల మధ్య సన్నని దారులనుంచీ కాలిబాట పట్టాల్సిందే. కానీ ఇప్పుడు ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా పేరు తెచ్చుకుంది. టూరిస్టులకు ప్రధాన కేంద్రంగా కూడా మారింది.
షిల్లాంగ్ శిఖర పర్వత ప్రాంతాలు పల్లెసీమల అందాలతో ఆకట్టుకుంటాయి. ప్రకృతి సహజ సౌందర్యాన్ని ప్రతిబింబిస్తాయి. రాష్ట్రానికే గుర్తింపు తెచ్చిన ఈ ప్రాంతంలో నెలకొన్న మాలినాంగ్ గ్రామం ఏకంగా ఆసియాలోనే పరిశుభ్రత కలిగిన గ్రామంగా పేరు తెచ్చుకుంది. రోడ్డుకు ఇరుపక్కలా ఏర్పాటు చేసిన వెదురు చెత్త బుట్టలు... పర్యావరణ పరిరక్షణకు నిలువుటద్దాలుగా కనిపిస్తాయి. తరచుగా వాలంటీర్లు రోడ్లను ఊడ్చి చెత్తను ఆ బుట్టలలో వేస్తుంటారు. ఖాశీ గిరిజనుల నివాస స్థలమైన మాలినాంగ్ కు మరో ప్రత్యేకత కూడ ఉంది. ఇక్కడ అరుదుగా మాతృస్వామ్య సమాజం కొనసాగడంతోపాటు... వారసత్వ సంపద తల్లినుంచీ కూతుళ్ళకు చేరుతుంది. అంతేకాదు తల్లి ఇంటిపేరే పిల్లలకు వర్తిస్తుంది. భారత నగరాల్లో ఉండే శబ్దాలు, దుమ్ము, ధూళి లేని గ్రామంగా కూడ ఈ పల్లె గుర్తింపు పొందింది.
పన్నెండు సంవత్సరాల క్రితం మొట్ట మొదటిసారి ఈ గ్రామానికి రోడ్డు మార్గాన్ని నిర్మించినట్లు ప్రచురించిన ఇండియా డిస్కవరీ మాగజిన్ 'ఏషియాస్ క్లీనెస్ట్ విలేజ్' గా ప్రకటించింది. ఆ తర్వాత ప్రపంచ పర్యావరణ వేత్తలు, టూరిస్టులు మాలినాంగ్ బాట పట్టారు. ఐదు వందలమంది మాత్రమే ఉండే ఈ గ్రామాన్ని ఇప్పుడు రోజుకు సుమారు 250 మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. అయితే పరిశుభ్ర గ్రామంగా గుర్తింపు పొందడం కూడ ఈ గ్రామానికి ఓ రకంగా నష్టాన్ని కలిగిస్తోంది. ఇతర ప్రాంతాలనుంచీ వరదలా వచ్చి పడుతున్న జనానికి... శబ్ద, వాయు కాలుష్యాలతో నిండిపోతోంది. దీంతో స్థానిక గెస్ట్ హౌస్ యజమాని ఊరికి చివర పార్కింగ్ స్థలాన్ని సూచించమంటూ ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడ చేశారు. ఇటువంటి సందర్భం వచ్చే ప్రమాదం ఉందని టూరిజం డెవలప్మెంట్ శాఖకు అప్పుడే సూచించినట్లు మేఘాలయా మాజీ పర్యాటక అధికారి దీపక్ లాలూ అంటున్నారు. ఈ పరిణామాలతో గ్రామంలోని సామాజిక సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మొట్టమొదట కలరా వ్యాప్తి చెందిన సమయంలో 130 సంత్సరాల క్రితమే మాలినాంగ్ లో పరిశుభ్రతను పాటించడం ప్రారంభించారు. వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి గ్రామంలో వైద్య సౌకర్యాలతో పాటు పరిశుభ్రతను కీలకంగా అమలు చేశారు. ప్లేగు, కలరా వంటి వ్యాధులు రాకుండా సంరక్షించుకోవాలంటే పరిశుభ్రత పాటించాలని పూర్వీకులు సూచించినట్లు అక్కడి క్రిస్టియన్ మిషనరీలు చెప్తున్నాయి. దీనికి తోడు దేశంలోని గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే మాలినాంగ్ ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లలో కూడ ముందుంది. గ్రామంలో నివసించే సుమారు 95 కుటుంబాలు ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవడం అందుకు నిదర్శనంగా చెప్పాలి. నగర రోడ్లపై చెత్త పేరుకుపోవడం దేశానికే అప్రతిష్ట కూడగడుతోందంటూ స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ... మాలినాంగ్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. స్వచ్ఛతకు, పరిశుభ్రతకు మారుపేరుగా నిలిచిన ఓ గ్రామం ఇండియాలో ఉండటం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, భారతీయులంతా ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
అయితే మాలినాంగ్ సాధించిన ప్రత్యేకతలకు గర్వ పడటంతో పాటు.. వాటిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా టూరిస్టులకు అనుమతిని నియంత్రించడం ఎంతో అవసరమని పర్యాటక శాఖ నిపుణులు సూచిస్తున్నారు.