
వాషింగ్టన్: భారతీయులు సహా వలసదారులకు అమెరికా పౌరులతో ఉత్తుత్తి పెళ్లిళ్లు చేయించి మోసానికి పాల్పడిన ఒక భారతీయుడిని అక్కడి కోర్టు దోషిగా నిర్ధారించింది. ఫ్లోరిడా రాష్ట్రం పనామా సిటీలో నివాసముంటున్న రవిబాబు కొల్లా(47) 2017 –2018 సంవత్సరాల్లో బే కౌంటీ ప్రాంతంలో ఉత్తుత్తి పెళ్లిళ్ల దందా సాగించాడు. అక్కడి ప్రభుత్వం నుంచి రాయితీలు అందేలా చేసేందుకు, స్థిర నివాసం ఉండేలా చేసేందుకు భారతీయులు సహా ఇతర వలసదారులకు అమెరికా పౌరులతో దాదాపు 80 వరకు పెళ్లిళ్లు జరిపించాడు.
అతడికి అమెరికా పౌరసత్వం ఉన్న క్రిస్టల్ క్లౌడ్(40) సహకరించింది. ఈ పెళ్లిళ్లకు అమెరికా పౌరసత్వం ఉన్న పనామా సిటీ, కల్హౌన్, జాక్సన్ కౌంటీలకు చెందిన సుమారు 10 మందిని ఆమె ఎంపిక చేసింది. నకిలీ పెళ్లిళ్లు చేయించిన నేరానికి రవిబాబుకు ఐదేళ్ల వరకు, వీసా మోసాలకు గాను 20 ఏళ్ల వరకు శిక్ష పడే చాన్సుంది.