టెహ్రాన్: అభ్యంతకర ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారన్న ఆరోపణలతో ఇద్దరు పార్కుర్ అథ్లెట్లను ఇరాన్‌లో అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. వాళ్లు చేసిన నేరమేంటి? అని నెటిజనులు ప్రశ్నిస్తున్నారు. అలిరెజా అద్భుతమైన ఫొటోలకు అవార్డు ఇవ్వాలి కానీ అరెస్ట్ చేయకూడదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తైన భవనంపై తన స్టంట్ భాగస్వామిని ముద్దు పెట్టుకున్న ఫొటోలను ప్రముఖ పార్కుర్ అథ్లెట్ అలిరెజా జపాలాఘీ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం రేగింది. వీరిద్దరినీ టెహ్రాన్ సైబర్ పోలీసులు అరెస్ట్ బీబీసీ వెల్లడించింది. షరియా చట్టం నిబంధనలు ఉల్లఘించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్ చేసినట్టు టెహ్రాన్ పోలీసు చీఫ్ హుస్సేన్ రహీమి ధ్రువీకరించారు.
అయితే అలిరెజా జపాలాఘీ గతంలో ఇలాంటి ఫోటోలను బహిర్గతం చేసినా ఇప్పుడే అరెస్ట్ చేయడంపై నెటిజనులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి అదృశ్యం గురించి ప్రశ్నించినందుకే అతడిని అరెస్ట్ చేశారని అంటున్నారు. మాదక ద్రవ్యాల నిరోధక విభాగంలో పోలీసు అధికారి అయిన తన తండ్రి అదృశ్యం వెనుకున్న మిస్టరీని ఛేదించడంలో పోలీసులు విఫమలయ్యారని అలిరెజా ఆరోపించిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు నెటిజనులు గుర్తుచేశారు. (ముద్దు పెట్టుకున్నారు.. అరెస్టు చేశారు)
అసలేంటి ఈ ఆట?
పార్కుర్‌ను ఫ్రీరన్నింగ్ అని కూడా పిలుస్తారు. ఫ్రాన్స్‌లో పుట్టిన ఈ క్రీడ సైనికులకు ఇచ్చే శిక్షణ నుంచి ఆవిర్భవించింది. పరుగెడుతూ, దూకుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ, వివిధ రకాల విన్యాసాలతో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగిపోవడమే ఈ ఆటలోని ప్రాధానాంశం. ఆటలో భాగంగా ట్రేసర్లు లేదా ట్రేసర్స్ అని పిలువబడే ప్రాక్టీషనర్లు, సహాయక పరికరాలు లేకుండా సాధ్యమైనంత వేగంగా, సమర్థవంతమైన మార్గంలో సంక్లిష్ట వాతావరణంలో ఒక పాయింట్ నుండి మరొకదానికి చేరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment