ఫిట్‌గా దృఢంగా ఉండి.. ఎక్కువకాలం జీవించాలనుకుంటున్నారా? అయితే, ఇందుకోసం కొంచెం ఒళ్లు వంచండి. జిమ్‌కు వెళ్లకపోయినా పర్వాలేదు. ఇంట్లోనే రోజూ క్రమంతప్పకుండా కసరత్తులు చేయండి అంటున్నారు శాస్త్రవేత్తలు. బస్కీలు (పుష్‌అప్స్), గుంజీలు (సిట్‌అప్స్) వంటి కసరత్తులను క్రమంతప్పకుండా చేసేవారు.. తమ జీవితకాలానికి మరికొన్నేళ్లు జోడించుకొని ఆయుష్షును పెంచుకోవచ్చునని తాజా అధ్యయనంలో వెల్లడైంది. శారీరక బలాన్ని పెంపొందించుకునేందుకు కసరత్తులు చేసేవారిలో అకాలపు మరణాలు సంభవించే అవకాశం 23శాతం తక్కువ అని, అదేవిధంగా క్యాన్సర్ సంబంధిత మరణాలు 31శాతం తగ్గే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది.
'శారీరక బలాన్ని పెంపొందించుకొనే ఎక్సర్‌సైజ్‌లు.. సైక్లింగ్, జాగింగ్‌లాగా ఆరోగ్యానికి కీలకమైనవే కాకుండా క్యాన్సర్ మరణాల ముప్పును తగ్గించడంలో ఇవి అత్యంత ముఖ్యమైనవని మా అధ్యయనంలో తేలింది' అని సిడ్నీ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ఎమాన్యుయేల్ స్టామటకిస్ తెలిపారు. మొత్తం 80,306మందిని రెండేళ్లపాటు పరిశీలించి.. వయస్సు, లింగభేదం, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వంటి వాటి ఆధారంగా కొన్ని మార్పులు సూచించి.. ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న వారందరూ గుండె వ్యాధి లేదా క్యాన్సర్ సోకి ప్రారంభదశలో ఉన్నారు. ఈ పరిశోధన కాలంలో చనిపోయిన వారిని మినహాయించి మిగతావారిపై అధ్యయనం కొనసాగించారు.
'ప్రత్యేకమైన పరికరాలు ఏమీలేకుండా సొంతంగా చేసే శారీరక ఎక్సర్‌సైజ్‌లు.. జిమ్ ట్రైనింగ్ అంతటి ప్రభావాన్ని చూపిస్తాయి. కసరత్తులు అనేగానే.. ప్రజలు జిమ్‌కు వెళ్లి బరువులు ఎత్తాలని భావిస్తుంటారు. నిజానికి అది అవసరం లేదు. చాలామంది ఖర్చు కారణంగా, తమ పని సంస్కృతి కారణంగా జిమ్‌కు వెళ్లడానికి భయపడుతుంటారు. అలాంటి వారు ఇంట్లో లేదా పార్కులో పుష్‌అప్స్, సిట్‌అప్స్, ట్రైసెప్స్ డిప్స్ వంటివి చేయడం ద్వారా ఆరోగ్యాన్ని దృఢంగా పెంపొందించుకోవచ్చు' అని పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను అమెరికన్ జర్నల్ ఎపిడెమియాలజీలో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment