కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. గుర్తుతెలియని సాయుధులు మంగళవారం కాబూల్‌లోని ఓ టీవీ చానెల్‌లోకి చొరబడి కాల్పులతో బీభత్సం సృష్టిస్తున్నారు. ప్రముఖ టీవీ చానెల్ షంషాద్ ప్రధాన కార్యాలయంపై సాయుధులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు మృతి చెందినట్టు తెలుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం భద్రతా బలగాలు టీవీ చానెల్‌ను చుట్టుముట్టి తమ అధీనంలోకి తీసుకున్నాయి. చానెల్‌లో కాల్పులతో విరుచుకుపడుతున్న సాయుధులను ఏరివేయడమే లక్ష్యంగా భద్రతా దళాల ఆపరేషన్ కొనసాగుతోంది. ఒక సాయుధుడిని భద్రతా దళాలు మట్టుబెట్టాయని కాబూల్ పోలీసులు ప్రకటించారు. మిగతా సాయుధులను కూడా ఏరివేసి.. చానెల్ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని భద్రతా బలగాలు తెలిపాయి.
త్రుటిలో తప్పించుకున్నాను: రిపోర్టర్
భారీ ఆయుధాలతో వచ్చిన సాయుధులు గ్రనేడ్‌లు విసురుతూ.. విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ.. చానెల్ కార్యాలయంలోకి చొరబడ్డారు. ఈ సమయంలో కార్యాలయంలోని చాలామంది సిబ్బంది, ఉద్యోగులు ఉన్నట్టు తెలుస్తోంది. కార్యాయలంలో చొరబడిన సాయుధులు కాల్పులు కొనసాగిస్తుండటంతో అందులోని ఉద్యోగులు భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని గడుపుతున్నారు. సాయుధుల దాడి నుంచి త్రుటిలో తప్పించుకున్నట్టు చానెల్ రిపోర్టర్ ఒకరు మీడియాకు తెలిపాడు. చానెల్ కార్యాలయంలో భయానక వాతావరణం నెలకొందని, కాసేపటికోసారి కాల్పుల శబ్దం, ఉద్యోగాల హాహాకారాలు వినిపిస్తున్నాయని ఆయన వివరించారు. వందమందికిపైగా ఉద్యోగులు కార్యాలయ భవనంలో ఉన్నారని తెలుస్తోంది. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారన్నది ఇంకా తెలియరాలేదు. ఇటీవల కాబూల్‌లో తాలిబన్, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుస దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment