వాషింగ్టన్ : ‘అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా. మనమంతా కలిసే ఇది పూర్తి చేద్దాం. నాతో కలిసి రండి’ అంటూ భారత సంతతి సెనెటర్ కమలా హ్యారిస్(54) అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే విషయమై ప్రకటన చేశారు. ఈ మేరకు సోమవారం ఆమె ట్వీట్ చేశారు. సెనెటర్‌గా ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా చరిత్రకెక్కిన కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాటించే వలస విధానాలు, ఇష్టారీతిన కీలక పదవుల్లో తన అనునాయులను నియమించే తీరును ప్రధానంగా విమర్శించేవారు. కాలిఫోర్నియా మాజీ అటార్నీ జనరల్‌గా విధులుగా నిర్వర్తించిన ఆమె ముఖ్యంగా పౌర హక్కుల కోసం పోరాడుతున్నారు.
మధ్యతరగతి ప్రజలు, హెల్త్‌కేర్ ప్రధాన అజెండా
కాలిఫోర్నియాలోని ఆక్లాండ్‌లో గల బాల్టిమోర్ నుంచి కమలా హ్యారిస్.. ‘ఫర్ ద పీపుల్’ అనే నినాదంతో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా మధ్యతరగతి ప్రజలు చెల్లించే పన్ను, ఇమ్మిగ్రేషన్ పాలసీ, హెల్త్‌కేర్ సిస్టమ్, న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచడం తదితర అంశాలను ఆమె ప్రముఖంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ‘మనమంతా కలిసే ఈ పని పూర్తి చేస్తాం. మన భవిష్యత్తును నిర్మించుకుందాం. మన కోసం, మన పిల్లల కోసం, మన దేశం కోసం’ అంటూ కమలా హ్యారిస్ తన క్యాంపెయిన్ వీడియోను విడుదల చేశారు. కాగా కమలా హ్యారిస్‌కు డెమోక్రటిక్ పార్టీలో మంచి నేతగా గుర్తింపు ఉంది. ఆమె సన్నిహితులు కమలను ‘ఫిమేల్ ఒబామా’ గా అభివర్ణిస్తారు. ఇక డెమోక్రటిక్ పార్టీ తరఫున మరో కీలక నాయకురాలు తులసీ గబ్బార్డ్ కూడా అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడనున్న విషయం తెలిసిందే. ఆమెతో సహా మొత్తం 12 మంది అభ్యర్థులు డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతారని అంచనా.
మానవత్వంపై దాడి..
డొనాల్డ్ ట్రంప్ పాలనలో వలస పౌరుల హక్కులు పరిరక్షించే వ్యక్తిగా కమలా హ్యారిస్ గుర్తింపు పొందారు. అమెరికా సరిహద్దుల్లో ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేయడాన్ని ‘మానవత్వంపై దాడి’ అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇండో- ఆఫ్రికన్ మిశ్రమ సంతతికి చెందిన మొదటి అమెరికన్ సెనేటర్‌గా (2016) ఎన్నికైన ఆమె.. అంతకు ముందు కాలిఫోర్నియా అటర్నీ జనరల్‌గానూ ఎన్నికైన తొలి భారత సంతతి మహిళగా నిలిచారు. అమెరికా ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) చట్టంపై మన వైఖరేమిటంటూ స్వపక్షం డెమొక్రాట్లను కూడా సవాల్ చేసి ఇరుకున పెట్టిన ఘనత ఆమె సొంతం.
చెన్నై మూలాలు...
1964 అక్టోబర్ 20న కాలిఫోర్నియాలో కమలా దేవి హ్యారిస్ జన్మించారు. ఆమె తల్లిదండ్రులు శ్యామలా గోపాలన్- డొనాల్డ్ హారిస్‌లు. చెన్నైకి చెందిన శ్యామలా గోపాలన్ న్యూట్రిషన్, ఎండోక్రినాలాజీలో పరిశోధన కోసం అమెరికా వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్ హారిస్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. కమల.. తాతగారు పీవీ గోపాలన్ భారత స్వాతంత్య్ర సమరయోధుడు, ఆ తర్వాత దౌత్యాధికారిగా కూడా పనిచేశారు. ఆమె అమ్మమ్మ కూడా మహిళలకు కుటుంబ నియంత్రణ హక్కు కలిగి ఉండాలనే ప్రచారంలో పాల్గొన్నారు. చిన్నతనంలో తరచుగా చెన్నైకు వస్తుండడం వల్ల తాత ప్రభావం ఆమెపై పడింది.
ఆఫ్రికా సంతతికి చెందిన తండ్రి- ఆసియా సంతతి చెందిన తల్లిదండ్రుల పెంపకంలో అటు ఆఫ్రికా, ఇటు ఆసియా సంస్కృతుల కలబోతగా ఆమె నిలుస్తున్నారు. మిశ్రమ సంస్కృతి కారణంగా ఆమెను రాజకీయంగా బరాక్ ఒబామాతోనూ పోల్చేవారు. 1986లో హోవార్డ్ యూనివర్సిటీ నుంచి రాజకీయ, ఆర్థిక శాస్త్రాల్లో డిగ్రీ పూర్తిచేశాక, హేస్టింగ్ కాలేజీ ఆఫ్ లా నుంచి న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్‌కో డిస్ట్రిక్ అటార్నీగా ఎన్నికైన తొలి నల్లజాతి, దక్షిణాసియా సంతతి మహిళగా చరిత్ర సృష్టించారు. 2011-17 మధ్య కాలంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పనిచేశారు. 2014లో డగ్లస్ ఎమ్‌హోఫ్‌ను పెళ్లిచేసుకున్నారు. 2017 జనవరిలో కాలిఫోర్నియా సెనేటర్‌గా కీలకబాధ్యతలు చేపట్టారు.
I'm running for president. Let's do this together. Join us: https://t.co/9KwgFlgZHA pic.twitter.com/otf2ez7t1p
— Kamala Harris (@KamalaHarris) January 21, 2019
Comments
Please login to add a commentAdd a comment