బ్రిస్బేన్: కొండ మీది నుంచి లోయలోకి పడ్డా.. ఆమెకు నూకలు మాత్రం చెల్లిపోలేదు. ఆరో రోజులు మృత్యువుతో పోరాడిన ఆమె చివరకు ప్రాణాలతో బయటపడింది. గురువారం ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఘటన చోటు చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జోహీ హాన్(25) గత గురువారం క్వీన్స్‌ల్యాండ్‌లో టల్లీ పట్టణానికి వెళ్లారు. అక్కడి నుంచి తన స్నేహితురాలికి ఫోన్ చేసిన ఆమె.. కెర్నిస్ అటవీ ప్రాంతంలోని టైసన్ పర్వతంపైకి ట్రెక్కింగ్‌కు వెళ్తున్నట్లు చెప్పారు.
అయితే ఆ తర్వాత ఆమె జాడ లేకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, సైన్యం హెలికాఫ్టర్ సాయంతో అధికారులు గాలింపు చేపట్టారు. అయినా లాభం లేకపోయింది. శనివారం అటవీ మార్గం గుండా వెళ్తున్న కొందరికి దూరంగా సాయం చేయాలన్న కేకలు వినిపించాయి. అయితే వారు పోలీసులకు సమాచారం అందించేసరికి కాస్త ఆలస్యమైంది. తిరిగి ఏరియల్ సర్వే ద్వారా గాలింపు చేపట్టిన అధికారులు.. ఎట్టకేలకు జలపాతం దగ్గర ఆమెను గుర్తించి రక్షించారు. టల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా, ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.
కొమ్మల్లో చిక్కుకుని... కొండ మీద ఉన్న ఓ రాయిపై నిల్చుని ఫోటో తీసుకునే సమయంలో ఆమె కిందపడినట్లు తెలుస్తోంది. అయితే అదృష్టవశాత్తూ కింద ఉన్న రాక్సీ జలపాతం చెట్ల భాగంలో ఆమె చిక్కుకుపోయారు. అలా కొన్ని గంటలు స్పృహ లేకుండా పడి ఉన్న ఆమె.. మేలుకువ రాగానే కిందకు దిగి సాయం కోసం కేకలు వేయటం ప్రారంభించారు. అప్పటికే పూర్తిగా నీరసించిన ఆమె అక్కడే కుప్పకూలిపోయారు. పైన హెలికాఫ్టర్ శబ్ధం విన్న ఆమె కింద ఉన్న ఇసుక తిన్నెలపై రక్షించాలంటూ రాతలు రాశారు. అయితే అవి సైన్యం కంటపడలేదు. చివరకు శక్తిని కూడగట్టుకుని ఆమె వేసిన కేకలు స్థానికుల చెవిన పడటంతో ప్రాణాలతో ఆమె బయటపడగలిగారు.
Comments
Please login to add a commentAdd a comment