
బీరుట్ : 'అమెరికాకు చావే' అంటూ లెబనాన్‌కు చెందిన అల్ అక్బర్ అనే వార్త పత్రిక తన తొలి పేజీలో ప్రచురించింది. జెరూసలెంను తాము ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారిక ప్రకటన చేసిన నేపథ్యంలో తొలిసారి ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ దినపత్రిక తన ఆగ్రహాన్ని వెలిబుచ్చింది.
ఇజ్రాయెల్ రాజధానిగా టెల్ అవీవ్ స్థానంలో తాము జెరూసలెంను గుర్తిస్తున్నామంటూ ట్రంప్ ప్రకటించారు. అక్కడే తమ రాయబార కార్యాలయాన్ని ఏర్పాటుచేసి కార్యక్రమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అరబ్ దేశాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మధ్య ప్రాచ్చ దేశాల్లో అశాంతిని రగిలించడమేనంటూ మండిపడ్డాయి. ఇది చట్ట వ్యతిరేకం అని, రెచ్చగొట్టే చర్య అని ఇరాన్ ఇప్పటికే తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది.