చైనా: కరోనా కట్టడి కోసం ప్రపంచ దేశాలన్ని లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. చైనాలో సుమారు ఐదు నెలలు కొనసాగిన లాక్‌డౌన్ వల్ల ఓ యువకుడు ఊహించని విధంగా బరువు పెరిగిపోయాడు. చివరికి లేవలేని స్థితికి చేరుకున్నాడు. వుహాన్‌కు చెందిన జహౌ అనే 29 ఏళ్ల యువకుడు ఓ కేఫ్‌లో పనిచేసేవాడు. లాక్‌డౌన్‌కు ముందే జహౌ సుమారు 100 కిలోల బరువు ఉన్నాడు. ఈ ఐదు నెలల వ్యవధిలో అదనంగా మరో 100 కిలోలకు పైగా బరువు పెరిగిపోయాడు. లాక్‌డౌన్ నుంచి ఉపశమనం కల్పించిన తర్వాత జహౌ బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. బరువు వల్ల అతడికి నిద్ర కూడా కరవైంది. ఒకానొక సందర్భంలో అతడు 48 గంటలు నిద్రలేకుండా గడిపినట్లు వైద్యులు తెలిపారు. దాంతో ఆందోళనకు గురైన జహౌ.. సాయం కోసం ఎమర్జన్సీ సేవలను ఆశ్రయించాడు. (కరోనా: ఈ మందు బాగా పనిచేస్తోంది!)
ఈ క్రమంలో వైద్యులు ఎంతో కష్టపడి అతడిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం అతడి బరువు 280 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జహౌ ప్రస్తుతం వుహాన్ యూనివర్శిటీలో చికిత్స పొందుతున్నాడు. అతడికి వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. రిపోర్టులు చూసి షాకయ్యారు. ఇంకొన్ని రోజులు అతడు అదే పరిస్థితిలో ఉండి ఉంటే గుండెనొప్పి, శ్వాసకోస సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయేవాడని తెలిపారు. జూన్ 1న హాస్పిటల్‌లో చేరిన జహౌను ఐసీయూలో ఉంచి క్రమం తప్పకుండా మందులు ఇస్తున్నారు. ఫలితంగా జూన్ 11 నుంచి అతడిలో కాస్త మార్పు కనిపించినట్లు వైద్యులు వెల్లడించారు. గత ఐదు నెలలుగా అతడు ఇంట్లోనే కుర్చొని ఉండటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వైద్యులు తెలిపారు.
కొంతమందిలో జన్యు సంబంధిత సమస్య వల్ల కూడా విపరీతంగా బరువు పెరిగిపోతారని, జహౌ అంత బరువు పెరగడానికి కూడా అదే కారణమని వైద్యులు తెలిపారు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించడం ఇప్పుడు సాధ్యం కాదని.. అతడు ఇంకో 23 కిలోల బరువు తగ్గితే శస్త్ర చికిత్స చేయడం సాధ్యమవుతుందని వైద్యులు తెలిపారు.(భారత్‌కు చేరిన అమెరికా వెంటిలేటర్లు)
Comments
Please login to add a commentAdd a comment