
లండన్: సెంట్రల్ లండన్‌లో శుక్రవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని ఆక్స్‌ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్‌లో కాల్పులు జరిగినట్లు సమాచారం రావడంతో అప్రమత్తమైన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రయాణీకులను సురక్షితంగా బయటకు తరలించి, స్టేషన్‌ను మూసేశారు. అలాగే, ముందు జాగ్రత్తగా పక్కనున్న బాండ్ స్ట్రీట్ స్టేషన్‌నూ మూసివేశారు. ఈ ప్రాంతానికి ఎవరూ రావద్దని, ఇప్పటికే వచ్చిన వారు రోడ్లపై తిరగకుండా, ఏవైనా భవనాల్లోకి వెళ్లిపోవాలనీ, స్థానికులు కూడా బయటకు రావొద్దని పోలీసులు హెచ్చరించారు.
మొత్తం ప్రాంతాన్ని క్షుణ్నంగా తనిఖీ చేశారు. ఈ లోపే అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు అక్కడికి చేరుకున్నాయి. మరిన్ని భద్రతాబలగాలు కూడా మోహరించాయి. అయితే, తనిఖీల అనంతరం కాల్పులకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదని పోలీసులు వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ సర్కస్ ట్యూబ్ స్టేషన్‌లో కాల్పుల శబ్దం వినిపించినట్లు స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4.38 గంటలకు తమకు కొందరు ఫోన్లు చేశారని పోలీసులు చెప్పారు. దీంతో ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉండొచ్చేమోనన్న అనుమానంతో చర్యలు చేపట్టామని వివరించారు.