ఐఫోన్ 7 ఫ్రీగా వస్తుందన్న కక్కుర్తితో..!
ఫ్రీగా వస్తే పినాయిల్ తాగే వ్యక్తులు ఉంటారని తరచుగా ఆ మాట వింటూనే ఉంటాం. ప్రస్తుతం దానికి భిన్నమైన ఘటన ఉక్రెయిన్ లో జరిగింది. ఓ యువకుడు స్మార్ట్ ఫోన్ పిచ్చితో ఏకంగా తన పేరును శాశ్వతంగా మార్చేసుకున్నాడు. వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఓలెజ్ఞాండర్ తురిన్(20) ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో ఉండేవాడు. అతడికి స్మార్ట్ ఫోన్స్ అంటే విపరీతమైన ఇష్టం. అందులో ఏకంగా ఐఫోన్ 7 వస్తుందంటే ఆగుతాడా.
ఉక్రెయిన్ యువకుడు రాజధాని కీవ్ నగరంలో ఓ ఆఫర్ గురించి విన్నాడు. అదేమంటే.. కీవ్ లోని ఐఫోన్ స్టోర్ బంపర్ ఆఫర్ అంటూ.. పేరు మార్చుకునేందుకు సిద్ధంగా ఉన్న వ్యక్తులలో తొలి ఐదుగురికి ఐఫోన్ 7 ఫ్రీ అని ప్రకటించింది. దీంతో ఏ మాత్రం వెనుకాడకుండా ఓలెజ్ఞాండర్ అందుకు అంగీకరించాడు. స్టోర్ వాళ్ల ఆఫర్ మేరకు 'ఐఫోన్ సిమ్ సెవెన్' గా తనపేరు మార్చుకున్నాడు. 'ప్రతి మనిషి తనను తాను ఏదో ఒక కొత్త తరహాలో ఆవిష్కరించుకోవాలనుకుంటారు కదా. ప్రస్తుతం తాను కూడా అందరికంటే భిన్నంగా ఉండాలని భావించాను. మరో వ్యక్తి గతంలో ఇదే తరహాలో తన పేరును ట్విట్టర్ అని మార్చుకున్నాడు. అలాంటిది నేను ఐఫోన్ కోసం పేరు మార్చుకుంటే తప్పేముంది' అని ఐఫోన్ సిమ్ సెవెన్ అన్నాడు.
ఓలెజ్ఞాండర్ తురిన్ సోదరి మాట్లాడుతూ.. ఈ విషయాన్ని తాము జీర్ణించకోలేకపోతున్నామని, నమ్మడానికి చాలా కష్టంగా ఉన్నా తప్పడం లేదన్నారు. సెవెన్ గా పేరు మార్చుకోవడంతో ఒక్కరోజులోనే స్థానికంగా సెలబ్రిటీ అయిపోయాడు.