60గంటలపాటు మృత్యువుతో పోరాడి..
బీజింగ్: కొండచరియలు విరిగిపడటంతో కూలిపోయిన భవంతి శిథిలాలకిందపడి దాదాపు 60 గంటల తర్వాత కూడా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. చైనాలోని షింజెన్ ఇండస్ట్రియల్ పార్క్ సమీపంలో కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 70మంది ప్రాణాలుకోల్పోగా కూలిన భవంతుల శిథిలాల కింద గాలింపులు చేపడుతున్నారు.
ఈ క్రమంలో చాంకింగ్ ప్రాంతానికి చెందిన తియాన్ జెమింగ్ అనే వలస కూలిని శిథిలాలు తొలగిస్తూ గుర్తించారు. అతడిని జాగ్రత్తగా బయటకు తీశారు. దాదాపు 60గంటలపాటు శిథిలాలకిందే ఉండిపోయిన తియాన్ మెల్లగా మాట్లాడగలుగుతున్నాడు. అతడి నాడీ వ్యవస్థ నెమ్మదించింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి వైద్యం ఇప్పిస్తున్నారు. అంత భారీ మొత్తంలో శిథిలాలు మీదపడిన పైకి ఎలాంటి గాయాలుకాకపోవడం, 60 గంటలు గడిచినా సురక్షితంగా ఉండటం సహాయబృందాలకు ఆశ్చర్యాన్ని కలిగించింది.