
వియత్నాం: దాయాది దేశాలైన భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై మాట్లాడిన ఆయన.. ఈ అంశం త్వరలోనే ముగిసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్-పాకిస్థాన్ నుంచి మంచి కబురు త్వరలోనే అందుతుందని తాము భావిస్తున్నట్టు ఆయన చెప్పారు. వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
పూల్వామా ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ వైమానిక దాడులు నిర్వహించడం.. అందుకు ప్రతిగా పాక్ భారత్ గగనతలంలోకి యుద్ధవిమానాలతో చొరబడటం.. సరిహద్దుల్లో యుద్ధవాతావరణం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించి.. సామరస్య పూర్వక వాతావరణం కల్పించేందుకు అమెరికా తీవ్రంగా మధ్యవర్తిత్వం నెరుపుతోంది. ఇందులో భాగంగా ఇరుదేశాల విదేశాంగ మంత్రులతో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పొంపియో మాట్లాడటంతో సహా పలు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ట్రంప్ దాయాదుల నుంచి గూడ్ న్యూస్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.