వందేళ్ళయినా వీడని బంధం!
చిన్న చిన్న సమస్యలకే కుంటుంబ సంభంధాలు సమసిపోతున్న ఈ రోజుల్లో... ఆ కవలలిద్దరూ ఏకంగా వందేళ్ళయినా కలిసే జీవిస్తున్నారు. కష్టమైనా సుఖమైనా కలిసే పంచుకున్నారు. ప్రేమానుబంధాలకు మారుపేరుగా నిలుస్తున్నారు. నిండు నూరేళ్ళ జీవితాన్ని హాయిగా, ఆనందంగా జీవించి ఇటీవలే వందేళ్ళ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు.
కెంటకీ లోని సిమ్సోనియాకు చెందిన మేరీ బెల్లీ రోచ్, మయెబెల్లె పోవెల్ లు ఇటీవలే తమ వందేళ్ళ పుట్టిన రోజు జరుపుకున్నారు. కవలలుగా పుట్టి, చిన్ననాటినుంచీ కలిసే పెరిగారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో టీనేజర్స్ గా ఉన్న వారిద్దరూ అప్పట్లో తమ ముద్దుపేరైన ది వాలెస్ ట్విన్స్ గానే నేటికీ పిలువబడుతున్నారు. అప్పట్లో ఎన్నో ఆర్థిక కష్టాలున్నా... ముర్రే స్టేట్ కాలేజీలో 5 డాలర్ల సెమిస్టర్ ఫీజు కట్టి ఇద్దరూ చదువుకున్నారు. ఒకేలా కనిపించడం కాలేజీ రోజుల్లో వారిద్దరికీ అనేకసార్లు కలసి వచ్చేది. ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటూ, క్లాస్ రూంలో ఒకరు నోట్స్ రాస్తుంటే, మరొకరు జిమ్ క్లాస్ కు వెళ్ళేందుకు ఉపయోగపడేది. చదువులోనూ, పనిలోనూ ఒకరికొకరు సహాయపడుతుండేవారు. ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తినే ఎంచుకున్నఆ కవల సోదరీమణులు.. రోజుకు ఒక్క డాలర్ చొప్పున చెల్లించే సిమ్సోనియాలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో పనిచేసేవారు.
పెళ్ళీడువచ్చిన తర్వాత ఇద్దరు ప్రాణస్నేహితులను పెళ్ళాడారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో ఇద్దరు దంపతులూ మోటార్ వాహనంలో యూరప్ లోని 50 రాష్ట్రాలను, 8 దేశాలను చుట్టేశారు. ఇద్దరి భర్తలనూ పోగొట్టుకున్న అనంతరం.. వారిద్దరూ కొంతకాలం డెట్రాయిట్ కు వలస వెళ్ళి అక్కడి వార్ టైం ఫ్యాక్టరీల్లో పనిచేశారు. నాటినుంచీ నేటి వరకూ ఏ సందర్భంలోనూ విడిపోని ఆ కవలలలిద్దరూ ప్రస్తుతం తిరిగి చిన్ననాటి తమ ఇంట్లోనే నివసిస్తున్నారు. అక్కాచెల్లెళ్ళుగానే కాదు... మంచి స్నేహితులుగానూ ఉండే ఇద్దరూ చూసేందుకు పోలికల్లోనే కాదు.. వస్త్రధారణ విషయంలోనూ ఎక్కడా తేడా కనిపించదు. ఏ సమయంలోనైనా మేం కలిసే ఉన్నామని, ఇకముందూ ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్తున్నారు. వందేళ్ళ పుట్టినరోజును జరుపుకున్న ఆ కవలు... ఎందరో అక్కాచెల్లెళ్ళకే కాక, ప్రేమానుబంధాలకూ మారుపేరుగా నిలుస్తున్నారు.