
'మా ఆయన అలా మాట్లాడరు'
తన భర్తపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు.
న్యూయార్క్: తన భర్తపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ భార్య మెలానియా స్పందించారు. ఇవన్నీ అవాస్తవాలని, ఆయనపై ప్రత్యర్థులు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలను ఉద్దేశించి ట్రంప్ తీవ్ర అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన 2005 నాటి వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత తొలిసారి మెలానియా సోమవారం సీఎన్ఎన్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
'నా భర్త నాకు నమ్మకం ఉంది. ఇవన్నీ ఆయనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కల్పించినవి. నా భర్తపై ఆరోపణలు చేసిన మహిళల నేపథ్యంను పరిశీలించకుండానే ఆరోపణలు చేస్తున్నారు. ట్రంప్ పై చేస్తున్న ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేద'ని మెలానియా అన్నారు. తన భర్త అసభ్యకరమైన పదజాలం వాడడం తానేప్పుడు వినలేదని చెప్పారు. 'ఆయనేప్పుడు అలా మాట్లాడడం నేను వినలేదు. అందుకే ఆయనలా మాట్లాడారంటే నమ్మలేకపోతున్నాను. ఏకాంతంలోనూ ఆయన అనుచితంగా మాట్లాడిన సందర్భాలు లేవ'ని మెలాసియా పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను అంతకుముందు ఖండించిన మెలానియా ఇప్పుడు మాట మార్చడం గమనార్హం.
ట్రంప్ కు సంబంధించిన వీడియో టేపులు బయట పడిన వెంటనే ఆమె స్పందిస్తూ... 'నా భర్త మాట్లాడింది నూటికి నూరు శాతం తప్పే. అలాంటి వ్యాఖ్యలు గర్హనీయం. అయితే ఆయనిప్పుడు మునుపటి(2005నాటి) మనిషి కాదు. ఇప్పుడాయనలో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయి. పైగా సదరు కామెంట్లకు ఆయనకూడా క్షమాపణలు చెప్పుకున్నారు. కాబట్టి ప్రజలు ఆయన క్షమాపణలను సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నా' అంటూ మెలానియా ట్రంప్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.