మ్యూజియంలో మైక్రోస్కోపిక్ మోనాలీసా
లండన్: ప్రపంచంలో అత్యంత ఖరీదైన... అందమైన పెయింటింగుల్లో మోనాలీసా ఒకటి. ఆమె.. ఇప్పుడు సాంకేతిక నిపుణుల చేతిలో కొత్త రూపం దాల్చింది. పారిస్ లౌన్రే మ్యూజియంలో అతి సూక్ష్మ రూపంలో దర్శనమిస్తోంది. నానో టెక్నాలజీని ఉపయోగించి రూపొందించిన ఆ వర్ణ చిత్రం ఓ పిక్సల్ కంటే తక్కువగా ఉండి, ఐఫోన్ రెటీనా డిస్ ప్లే లా నిజమైన మోనాలీసా కంటే సుమారు పదివేల రెట్లు తక్కువగా కనిపిస్తోంది.
లేజర్ ప్రింటింగ్ టెక్నాలజీలో ఇప్పుడు అద్భుతాలను సృష్టించగల్గుతున్నారు. ఏ చిత్రాన్నైనా భిన్నంగా చూపించగల్గుతున్నారు. సుమారు 127.000 (డాట్స్ పర్ ఇంచ్) డిపిఐ రిజల్యూషన్ తో చిత్రాలు రూపొందే అవకాశం ఉండటంతో పాటు...అధిక నాణ్యత ఉండే ఈ కొత్త టెక్నాలజీపైనే అంతా ఆధారపడుతున్నారు. ముఖ్యంగా వార పత్రికలు వంటివి ప్రింట్ చేసేందుకు సుమారు మూడు వందల డిపిఐతో ఇది మంచి ఫలితాలనిస్తోంది.
ఈ లేజర్ టెక్నాలజీతో ఓ కొత్త అప్లికేషన్ ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్లుగా డెబ్ మార్క్ టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధక బృందం చెప్తోంది. దీంట్లో డేటాను కనిపించకుండా ఉండేంత సూక్ష్మ రూపంలో దాచుకునేందుకు వీలౌతుంది. సీరియల్ నెంబర్లు, బార్ కోడ్ లు వంటి వాటితో పాటు... ఇతర డేటానూ భద్రపరచుకోవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. దీంతో మోసాలకు పాల్పడేవారికి ముకుతాడు వేయొచ్చంటున్నారు అధ్యయనకారులు. ఇప్పుడు ఈ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా మోనాలీసా చిత్రానికి వినియోగించి అతి సూక్ష్మరూపంలో రూపొందించి ప్రత్యేకతను చాటారు.
కుడ్య రూపాలు, చిత్రాలకే కాక... అలంకరణలు, మొబైల్ ఫోన్లు వంటి ఉత్పత్తుల కోసం ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. కార్ల భాగాలు, వాయిద్య పరికరాల ప్యానెల్స్, బటన్స్ వంటి వస్తువుల తయారీ సులభతరం అవుతుండటంతో ఈ కొత్త విధానంపై విదేశీ కంపెనీలు సైతం ఆసక్తి చూపుతున్నాయి.