వాషింగ్టన్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) చైనాలోని వుహాన్‌లోనే ఉద్భవించిందన్న విషయాన్ని త్వరలోనే ప్రపంచదేశాలకు అర్థమయ్యేలా చేస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ విఫలమైందని మరోసారి విమర్శలు గుప్పించారు. ఇక ముందు ఇలాంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుండా అమెరికా చూసుకుంటుందని... ఇందుకోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో చైనా లేదా ఇతర దేశాల నుంచి ఏదైనా వైరస్ వ్యాప్తి చెందితే ఇతరుల ప్రాణాలు అపాయంలో పడకుండా సదరు వ్యవస్థ కాపాడుతుందని పేర్కొన్నారు. ఏదేమైనా కరోనా సమాచారాన్ని ప్రపంచ దేశాలతో పంచుకోకుండా సంక్షోభంలోకి నెట్టేసిన చైనా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.(అందరూ కరోనా బిజీలో ఉంటే.. చైనా మాత్రం)
గతేడాది డిసెంబరులో చైనాలో పురుడుపోసుకున్న కరోనా ధాటికి అమెరికాలో ఇప్పటి వరకు 50 వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం చైనా, డబ్ల్యూహెచ్‌ఓపై ఆది నుంచి నిప్పులు చెరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో మైక్ పాంపియో మాట్లాడుతూ...‘‘అమెరికాలో సంభవిస్తున్న మరణాలు, ఆర్థిక సంక్షోభానికి ఇందుకు మూలకారణమైన వారు తప్పక బాధ్యత వహించాలి. జవాబుదారీగా ఉండాలి. ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్న నేపథ్యంలో తిరిగి పూర్వస్థితికి చేరుకునేందుకు అమెరికా వారికి సహాయపడుతుంది. సరైన సమయంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధాలు తొలగుతాయి. వాణిజ్యం మళ్లీ ఊపందుకుంటుంది’’అని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనీస్ కమ్యూనిస్టు పార్టీ తమ ప్రయోజనాల కోసం పారదర్శకత ప్రదర్శించకుండా ఇంతట సంక్షోభానికి కారణమైందని మండిపడ్డారు.(వారికి రసాయనాలు తాగించండి)
ఇక అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రెయిన్ మాట్లాడుతూ.. ‘‘వైరస్ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలియదు. వుహాన్ మాంసం మార్కెట్ లేదా అక్కడి వైరాలజీ ల్యాబ్ నుంచి వ్యాపించిందని భావిస్తున్నాం’’అని పేర్కొన్నారు. కాగా కాంగ్రెస్ సభ్యుడు మైఖేల్ వాల్ట్ చైనా తీరును నిరసిస్తూ హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి అమెరికా మిలిటరీ, ఫెడరల్ ఉద్యోగులు పరోక్షంగా(థ్రిఫ్ట్ సేవింగ్స్ ప్లాన్) సమకూరుస్తున్న నిధులపై నిషేధం విధించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment