బెల్జియం చేరుకున్న ప్రధాని మోదీ
బ్రసెల్స్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్నారు. బెల్జియం ప్రధానమంత్రి ఛార్లెస్ మిషెల్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. అలాగే బ్రసెల్స్‌లో జరగనున్న 13వ ఇండియన్ - యూరోపియన్ యూనియన్ సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మార్చి 31వ తేదీన ప్రధాని మోదీ బెల్జియం నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు.
రెండు రోజుల పాటు జరగనున్న నాలుగో అణు భద్రత సదస్సు (న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్)లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షత వహించనున్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ నుంచి తిరుగు ప్రయాణంలో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. అందులోభాగంగా ఏప్రిల్ 1వ తేదీన రియాద్లో దిగుతారు. పలు కీలక చర్చల్లో మోదీ పాల్గొన్నున్నారు. ఏప్రిల్ 3వ తేదీన భారత్కు మోదీ తిరుగు ప్రయాణం అవుతారు.