ఆప్ కా స్వాగత్ హై.. దోస్త్! | Modi in Israel, may get arms ties booming | Sakshi
Sakshi News home page

ఆప్ కా స్వాగత్ హై.. దోస్త్!

Published Wed, Jul 5 2017 12:56 AM | Last Updated on Wed, Aug 15 2018 2:32 PM

ఆప్ కా స్వాగత్ హై.. దోస్త్! - Sakshi

ఆప్ కా స్వాగత్ హై.. దోస్త్!

మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం
► టెల్‌ అవివ్‌ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం
►  ఆలింగనాలతో ఆత్మీయత చూపిన ఇరువురు నేతలు


టెల్‌ అవివ్‌: ఇజ్రాయెల్, భారత్‌లు కలసికట్టుగా ముందుకు సాగితే మరిన్ని అద్భుతాలు సాధించగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఇజ్రాయెల్‌ చేరుకున్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. టెల్‌ అవివ్‌లోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూతో పాటు ఆయన కేబినెట్‌ మొత్తం మోదీని ఆహ్వానించేందుకు తరలివచ్చింది. ‘ఆప్‌ కాస్వాగత్‌ హై, మేరే దోస్త్‌’ అంటూ హిందీలో మోదీకి నెతన్యాహూ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే లభించే గౌరవం ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి దక్కింది.

విమానాశ్రయంలో మోదీ, నెతన్యాహూ మాట్లాడుతూ.. భారత్, ఇజ్రాయెల్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులో సహకరించుకుంటామని పేర్కొన్నారు. తన ఇజ్రాయెల్‌ పర్యటన మార్గదర్శకంగా నిలుస్తుందని మోదీ  చెప్పారు.  మోదీ విమానం దిగగానే ఇరు ప్రధానులు ఒకరి నొకరు మూడుసార్లు ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్‌ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. అనంతరం మోదీ, నెతన్యాహూ ఎయిర్‌పోర్టులో సంక్షిప్తంగా ప్రసంగించారు.

‘ఇది నిజంగానే చారిత్రక పర్యటనే, గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం  వేచిచూస్తున్నాం.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ’ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు మోదీని నా స్నేహితుడని సంబోధించారు. ‘భారత్‌ను ప్రేమిస్తున్నాం. ఆ దేశంతో సహకారంలో ఇక నుంచి ఆకాశమనే హద్దును కూడా చేరిపేస్తున్నాం. భారత్, ఇజ్రాయెల్‌ సంబంధాల్లో ఆకాశమే హద్దని మా మొదటి సమావేశంలో మోదీ చెప్పిన విషయం గుర్తుంది. ఇప్పుడు మనం అంతరిక్ష రంగంలో కూడా సహకరించుకుంటున్నాం.. అందువల్ల ఆకాశం కూడా ఇక అడ్డంకి కాద’ని నెతన్యాహూ పేర్కొన్నారు.

షాలోమ్‌.. మీ స్వాగతానికి కృతజ్ఞతలు: మోదీ
ఘన స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ.. హిబ్రూలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షాలోమ్‌(హలో).. ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విమానాశ్రయంలో స్వాగతం పలికిన నా స్నేహితుడు నెతన్యాహూకు కృతజ్ఞతలు. నా పర్యటన భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిని నేను కావడం గౌరవంగా భావిస్తున్నా.

ఇజ్రాయెల్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకోవడమే నా పర్యటన లక్ష్యం. ఇరు దేశాలకు ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం నుంచి మన సమాజాల్ని కాపాడుకోవాలి. కలసికట్టుగా పనిచేస్తే మరింత ముందుకు సాగడంతో పాటు అద్భుతాలు సాధిస్తాం. భారత్‌లో ఎంతో యువ శక్తి ఉంది. ఇరు దేశాల్లో తెలివైన, నైపుణ్యమున్న యువతరం ఉంది. వారే మన చోదకశక్త’ని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను కీలకమైన అభివృద్ధి భాగస్వామిగా అభివర్ణించారు.

‘ఇది అద్భుత యాత్ర.. ఇరు దేశాల ప్రజలు, సమాజ హితం కోసం కలసికట్టుగా సాగాలి. ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి భారత్, ఇజ్రాయెల్‌ మధ్య కొనసాగిన సంబంధాల్ని ఈ పర్యటనతో గుర్తుచేసుకుంటున్నా’మనిచెప్పారు. 41 ఏళ్ల క్రితం ఉగాండాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయిన నెతన్యాహూ పెద్దన్న యొనాతన్‌ని మోదీ గుర్తుచేశారు. ‘ఈ రోజు జూలై 4. సరిగ్గా 41 ఏళ్ల క్రితం యొనాతన్‌ తన ప్రాణాలను త్యాగం చేశారు’ అని ఆయన పేర్కొన్నారు.

ఎప్పుడూ మీ గురించే చెబుతుంటారు: మంత్రి
‘ప్రధాని నెతన్యాహూ ఎప్పుడూ మీ గురించే చెబుతుంటారు. మీరంటే మాకు ఎంతో ఇష్టం’ అని ఇజ్రాయెల్‌ కమ్యునికేషన్ల శాఖ మంత్రి అయూబ్‌ కారా మోదీతో అన్నారు. కేబినెట్‌ మంత్రుల్ని నెతన్యాహూ పరిచయం చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే మోదీ నవ్వుతూ ఆయనపై భుజంపై చేయి వేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement