ఉమ్మడిగా ఉగ్రపోరు
మీడియా సమావేశంలో మోదీ, నెతన్యాçహూ
టెల్ అవివ్: ఉగ్రవాద, అతివాద శక్తులపై ఉమ్మడిగా పోరు కొనసాగించాలని భారత్–ఇజ్రాయెల్ ప్రధానులు ఉద్ఘాటించారు. సంయుక్త మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం మోదీ, నెతన్యాçహూలు ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు ఒకే రకమైన ముప్పును, సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాటిపై కలసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు.
‘భారత ప్రధాని మోదీకి ఆతిథ్యమివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. భారత్‌ను మేం ఎంతో గౌరవిస్తున్నాం. ఇరు దేశాలు ఉగ్రవాదం వంటి ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని ఓడించాలని భారత్, ఇజ్రాయెల్‌లు కోరుకుంటున్నాయి. అందుకు కలసికట్టుగా, ఉమ్మడి పోరు జరపాలి. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలసికట్టుగా గొప్ప పనులు చేయగలమనే నమ్మకముంద’ని నెతన్యాహూ పేర్కొన్నారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘మనం తప్పకుండా ఉగ్రవాద, అతివాద శక్తుల్ని, హింసను వ్యతిరేకించాలి. అందుకోసం మానవత్వం, నాగరిక విలువల పట్ల నమ్మకం ఉన్నవారంతా ముందుకు రావాలి. కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఉగ్రభూతం దారుణాలకు యాద్ వాషెం మ్యూజియమే సాక్ష్యం. ఇజ్రాయెల్‌ను మరో ఇల్లుగా భావిస్తున్నాను. ఆ దేశం స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. గత కొన్నేళ్లుగా భారత్–ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి సంబంధాల్ని మరింత దృఢం చేసుకోవాల’న్నారు.