అమెరికాలోనూ మోదీ.. మోదీ.. నినాదాలు!
దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అమెరికాలో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్రమోదీకి అద్భుతమైన స్వాగతం లభించింది. భారతదేశంలో ఉన్నట్లే అక్కడ కూడా 'మోదీ.. మోదీ' అంటూ నినాదాలు మిన్నంటాయి. ఆయన బసచేసిన హోటల్ బయట భారీగా వచ్చిన అభిమానులు ఆయనను అభినందించేందుకు పోటీలు పడ్డారు. వారిని చూసిన మోదీ కూడా భద్రతను పక్కన పెట్టేసి నేరుగా వాళ్లలోకి వెళ్లిపోయారు. దాంతో భద్రతాధికారులు నోళ్లు వెళ్లబెట్టారు. విమానాశ్రయం నుంచి కాన్వాయ్లో బయల్దేరిన మోదీ.. కారు దిగిపోయి అభిమానులలో కలిసిపోయి వారికి చేతులు ఊపుతూ, ప్రతినమస్కారాలు చేస్తూ ముందుకెళ్లారు.
భద్రత అత్యంత ఎక్కువగా ఉండే న్యూయార్క్ నగరంలో.. అదీ భారత ప్రధాని లాంటి వీవీఐపీల విషయంలో ఇలా జరగడం అసాధారణం. ఐక్యరాజ్యసమితి సమావేశాల కోసం దాదాపు 140 మంది ప్రధానమంత్రులు, వివిధ దేశాల అధ్యక్షులు ఈ నగరానికి వచ్చినా, ఎవరి విషయంలోనూ ఇలా జరగలేదు. మోదీ బస చేస్తున్న న్యూయార్క్ ప్యాలెస్ హోటల్ బయట ట్రాఫిక్ మొత్తాన్ని బ్లాక్ చేసేశారు. హోటల్లోకి వచ్చేవాళ్లు కూడా విమానాశ్రయాల్లో ఉన్నట్లుగా ఫెడరల్ ఏజెంట్లు క్షుణ్ణంతా తనిఖీ చేసిన తర్వాతే వెళ్లాల్సి ఉంటుంది.