బీజింగ్: చైనా తన భూభాగంలో అంగుళం కూడా ఇతరులకు వదిలిపెట్టబోదని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ప్రపంచ రాజకీయాల్లో తన స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ఏ స్థాయి యుద్ధానికైనా సిద్ధమేనన్నారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్(ఎన్‌పీసీ) సమావేశాల చివరి రోజు జిన్‌పింగ్ ప్రసంగం దూకుడుగా సాగింది. చైనా జాతికి పునర్వైభవం సాధిద్దామంటూ ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
చైనా జాతీయవాదమే కేంద్రంగా.. పొరుగు దేశాలతో సంబంధాలు, ఉయిగుర్ సమస్య, తైవాన్ విలీనం, టిబెట్ తదితర అంశాలను ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. ఎన్‌పీసీ సమావేశాల చివరి రోజు సాధారణంగా ప్రధాని మీడియా సమావేశం ఉంటుంది. ఈ సంప్రదాయానికి విరుద్ధంగా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రసంగించారు. ఈ సమావేశాల్లో జిన్‌పింగ్ జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే. జిన్‌పింగ్ ప్రసంగం ఆయన మాటల్లోనే..
ప్రజా సేవకుడిని..
ఎన్ని అపరిమిత అధికారాలున్నా సరే, నేను ప్రజా సేవకుడిని. ఎప్పటి మాదిరిగానే వారి కోసం పనిచేస్తా. మన ప్రజలు పట్టుదల గలవారు, ఎవరికీ లొంగరు. స్వాతంత్య్రం కోసం శత్రువులతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధంగా ఉంటారు. మన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు కృతనిశ్చయంతో ఉందాం. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుదాం.
దేశాన్ని విభజించాలనుకునేవారి కుయుక్తులు చెల్లవు. వేర్పాటువాదులకు పరాజయం, శిక్ష తప్పదు. చైనా విస్తరణ వాదాన్ని, ఆధిపత్యాన్ని కోరుకోవటం లేదు. ప్రపంచ రాజకీయాల్లో మనదైన చోటు సంపాదించే అవసరమైన శక్తిసామర్థ్యాలున్నాయి. 170 ఏళ్లుగా ఇందుకోసం పోరాడుతున్నాం. ఈ కల నిజమవుతుందని స్పష్టం చేస్తున్నా.
పార్టీదే సర్వాధికారం..
చైనాలో కమ్యూనిస్టు పార్టీయే సుప్రీం. ఇరవై లక్షల సైన్యం, ప్రభుత్వ సంస్థలు కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలోనే పనిచేస్తాయి. దేశ రాజకీయ నాయకత్వంలో పార్టీదే అత్యున్నత స్థానం. చైనా జాతి గౌరవాన్ని నిలబెట్టి, కాపాడే బాధ్యత కూడా కమ్యూనిస్టు పార్టీదే.
జీవిత కాలం అధ్యక్షుడిగా ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ‘ఇది దేశ ప్రజలు, కమ్యూనిస్టు పార్టీ నాపై పెట్టిన గురుతర బాధ్యత. ఏ హోదాలో ఉన్న వారైనా సరే, ఇది ప్రజల చైనా అనే విషయాన్ని మరువరాదు. జాతి గౌరవాన్ని నిలబెట్టి, మరింత సంపన్నులు, బలవంతులుగా అయ్యేందుకు పట్టుదలతో ప్రజలు ముందుకు సాగుతున్నారు’ అని అన్నారు.
భారత్–చీనీ భాయి భాయి
భారత్, చైనాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్ని బలోపేతం చేసుకోవడంతో పాటు ఉన్నత స్థాయిలో మరిన్ని సంప్రదింపులు కొనసాగేలా ఆ దేశంతో కలిసి పనిచేస్తామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ తెలిపారు.
చైనా అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైన షీ జిన్‌పింగ్‌కు అభినందనలు తెలిపేందుకు మంగళవారం ఫోన్ చేసిన ప్రధాని మోదీ.. అంతర్జాతీయ వ్యవహారాల్లో సమన్వయం, సహకారాన్ని పటిష్టం చేసుకునేందుకు, అంతర్జాతీయంగా, ప్రాంతీయంగా శాంతి, అభివృద్ధి కోసం చైనాతో కలిసి నడిచేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. 21వ శతాబ్దం ఆసియాదేనని నిరూపించేందుకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కీలకమని ఇరువురు అంగీకారానికి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment