
‘హిందూ జనాభా పెరగొద్దని ఏ చట్టం చెబుతోంది?’
లక్నో: ‘హిందువుల జనాభా పెరగొద్దని ఏ చట్టం చెబుతోంది? అలాంటి చట్టమేదీ లేదు. ఇతరుల జనాభా పెరుగుతోంటే తమ జనాభాను పెంచుకోకుండా హిందువులను ఏది అడ్డుకుంటోంది?’అని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత సామాజిక పరిస్థితుల వల్లే వారి జనాభా పెరగడం లేదన్నారు. ఆదివారమిక్కడ 2వేల మంది ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్న కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని అధ్యాపకులు కోరగా, కేంద్ర ప్రభుత్వ దూతను కానని, మంత్రి జవదేకర్‌కు విన్నవించుకోవాలని సూచించారు. కాగా భాగవత్ సమాజాన్ని విభజించే ప్రకటనలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ మండిపడ్డారు. బీఎస్పీ చీఫ్ మాయావతి స్పందిస్తూ..‘ఎక్కువ మంది పిల్లల్ని సాకేందుకు తగిన ఏర్పాట్లు చేస్తారా అని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని భాగవత్‌కు చెబుతున్నా’ అని అన్నారు.