ఎట్టకేలకు ఫేస్బుక్లో వాళ్ల ఖాతా క్లోజ్...
మారుపేర్లతో సెల్ఫీలను పోస్టు చేసి బెదిరింపులకు పాల్పడిన ఖైదీలను ఎట్టకేలకు జైలు అధికారులు కనిపెట్టారు. మూడేళ్ళపాటు ఫేస్ బుక్ లో అకౌంట్లను కొనసాగించిన వారిని గుర్తించి ఆ ఖాతాలను మూసివేయించారు. ఓ వ్యక్తిని కత్తితో పొడిచి హత్యచేసి, జైలులో శిక్షను అనుభవిస్తున్న మార్క్ మెక్ గార్ట్ ల్యాండ్.. సహా మరి కొందరు హంతకులు సామాజిక నెట్ వర్కింగ్ సైట్ ను ఆయుధంగా చేసుకొని, బెదిరింపు సందేశాలను పంపుతున్నట్లుగా డైలీ రికార్డ్ రిపోర్ట్ లో వెల్లడైంది.
లెనార్క్ షైర్ షాట్స్ జైల్లో ఉన్న థగ్ కూడా తన సెల్ నుంచీ సెల్ఫీలను పోస్ట్ చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ వంటి వారు ఫేస్ బుక్ లో తమ సెల్ఫీలను పోస్టు చేయడం ఎంతో హాస్యాస్పదంగా ఉందని, బాధిత కుటుంబ సభ్యులకే ఇది అవమానకరమని జైలు అధికారులు అంటున్నారు. స్కాటిష్ జైళ్లలోని ఖైదీలు గత ఐదు సంవత్సరాల్లో ఫేస్ బుక్ ను దాదాపు ఐదు వందలసార్లు వినియోగించినట్లు ఆధారాలు తెలుపుతున్నాయి. మెక్ గార్ట్ ల్యాండ్... స్మైలర్ యా బాస్ పేరున 2013 లో ఫేస్ బుక్ లో తన ఖాతాను తెరిచాడు. అదే సంవత్సరం అందులో కక్ష సాధింపు చర్యలకు ఉసి గొల్పుతూ... బూతు పదాలను వాడుతూ ఎన్నో రాతలు రాశాడు. మరో పోస్ట్ లో అతను నీతి బోధలు చేశాడు. మెక్ గార్ట్ ల్యాండ్ తన ప్రొఫైల్ ఫొటోగా పెంపుడు కుక్కను పెట్టుకున్నాడు. అయితే డైలీ రికార్డ్ ఆధారంగా చివరిగా నవంబర్ 16 న అతని పోస్ట్ తర్వాత విషయం కనిపెట్టిన జైలు అధికారులు అకౌంట్ క్లోజ్ చేశారు.
మెక్ గార్ట్ ల్యాండ్ కు 2007 సంవత్సరంలో హత్యకేసులో 14 ఏళ్ళ కాగాగార శిక్ష పడగా... మరో ఖైదీ థగ్ కు పదిహేనేళ్ళ శిక్ష పడింది. ఇలా పలు కేసుల్లో జైల్లో శిక్షలు అనుభవిస్తున్నవారు సెల్ ఫోన్లను జైల్లో వాడుతూ, నెట్ వర్కింగ్ సైట్లలో క్రిమినల్ చర్యలకు సంబంధించిన వివిధ పోస్ట్ లు చేయడం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే జైళ్ళలో సామాజిక మీడియా సైట్లు, ఇంటర్నెట్ కు తాము అనుమతి ఇవ్వమని, ఖైదీలకు అకౌంట్ ఉన్నట్లుగా గుర్తిస్తే వెంటనే ఆ అకౌంట్ క్లోజ్ చేయమని అభ్యర్థిస్తామని ఓ స్కాటిష్ జైలు అధికారి చెప్తున్నారు. ఖైదీలు తమ సంరక్షణలో ఉన్నపుడు ఫేస్ బుక్ లో అకౌంట్ ఉన్నట్లు తెలిస్తే తొలగించమనే అధికారం తమకు ఉంటుందని చెప్తున్నారు.
జైళ్ళలో మొబైల్ ఫోన్ వినియోగం క్రిమినల్ చర్య అయినప్పటికీ స్కాట్స్ జైళ్ళలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నట్లు రికార్డులు చెప్తున్నాయి. సైట్లలో లాగిన్ అయ్యి, బయటి వ్యక్తులతో సన్నిహితంగా ఉండేందుకు ఖైదీలు స్మగుల్డ్ ఫోన్లను ఉపయోగింస్తున్నట్లు స్కాటిష్ ప్రిజన్ సర్వీస్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. 2010 నుంచి గతేడాది చివరి వరకూ 474 మంది ఖైదీలు.. వారి సన్నిహితులతో మాట్లాడేందుకు ఫేస్ బుక్ ను వినియోగించినట్లు ఎస్ పీ ఎస్ అధికారిక గణాంకాలు తెలిపాయి. మొబైల్ ఫోన్ వాడకం స్కాట్స్ జైళ్ళలో పెద్ద సమస్యగా మారినట్లు లెక్కలు తెలియజేస్తున్నాయి. 2015 లో మొత్తం 309 మంది ఖైదీలను మొబైల్ ఫోన్ వాడుతుండగా పట్టుకున్నారని, 2013,14 ల్లో కంటే ఈ సంఖ్య ఎంతో ఎక్కువగా ఉన్నట్లు లెక్కల్లో తేలింది.