'మానాన్న అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తాడు'
వాషింగ్టన్: తన తండ్రి అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలడని అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కుమారుడు డోనాల్డ్ జే ట్రంప్ (38) అన్నాడు. అదే సమయంలో తన తండ్రి సహజంగానే ప్రోత్సాహించే వ్యక్తి అని, తన కుటుంబ సభ్యుల సలహాతో ఆయన అధ్యక్ష బరిలో దిగారని ట్రంప్ కూతురు చెప్పింది. ఈ ఎన్నికలు తమ కుటుంబం మొత్తానికి అత్యంత ముఖ్యమైనవని అన్నారు. ప్రపంచ చరిత్రకు అమెరికానే భవిష్యత్తుగా మార్చే ఎన్నికలు కూడా ఇవే అని చెప్పారు.
వాషింగ్టన్ లో ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుపాటు జరుగుతున్న ఈ సదస్సులో ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ మాట్లాడుతూ 'చాలా కాలంగా మన దేశం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుందనే విషయం మర్చిపోయారు. దీంతో యువతరం భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. అత్యంత క్లిష్టమైన పెట్టుబడులు సైతం ఎలా పెట్టాలనే విషయాన్ని నేను నా తండ్రి వద్దే నేర్చుకున్నాను. గడ్డు పరిస్థితుల్లో ఉన్న అమెరికాను గట్టెక్కించేందుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల తన తండ్రిని అధ్యక్షుడిగా ఎన్నుకోవాల్సిన అవసరం, సమయం వచ్చింది' అని అన్నాడు. ఇలా అనగానే సదస్సులో చప్పట్ల వర్షం కురిసింది.