
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్
లాహోర్: పాకిస్తాన్ తలచుకుని ఉంటే 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిని నివారించగలిగి ఉండేదని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అభిప్రాయపడ్డారు. పాక్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయని ఆయన తొలిసారి బహిరంగంగా ఒప్పుకున్నారు. ప్రభుత్వేతర శక్తులు సరిహద్దు దాటి వెళ్లి ముంబైలో మారణహోమం సృష్టించేందుకు అవకాశం కల్పించిన పాక్ విధానాలను షరీఫ్ ప్రశ్నించారు. ప్రధానిగా ఉండిన షరీఫ్‌ను పనామా పేపర్ల కేసులో దోషిగా తేల్చిన పాక్ సుప్రీంకోర్టు.. ఆయన ఇకపై ఎప్పటికీ ఆ పదవి చేపట్టకూడదంటూ ఆదేశాలివ్వడం తెలిసిందే. డాన్ పత్రికతో షరీఫ్ తాజాగా మాట్లాడుతూ ‘మనంతట మనమే ఏకాకులమయ్యాం. త్యాగాలు చేస్తున్నా మన మాటలు ఎవ్వరూ నమ్మడం లేదు.
దీనిని మనం పరిశీలించుకోవాలి’ అని అన్నారు. ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ స్థాపించిన జమాత్ ఉద్ దవా, మరో ఉగ్రవాది మసూద్ అజర్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థల పేర్లను మాత్రం ఆయన ప్రస్తావించలేదు. ‘పాక్‌లో ఉగ్రవాద సంస్థలు క్రియాశీలకంగా ఉన్నాయి. వారిని ప్రభుత్వేతర శక్తులని పిలవచ్చు. సరిహద్దు దాటి వెళ్లి ముంబైలో 150 మందికిపైగా అమాయకులను చంపేందుకు మనం వారిని అనుమతించాలా? నాకు సమాధానం చెప్పండి. పదేళ్లయినా మనం విచారణను ఎందుకు పూర్తి చేయలేక పోతున్నాం’ అని నవాజ్ షరీఫ్ అన్నారు.