ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 26/11 ముంబై పేలుళ్లు తమ దేశం పనేనని అంగీకరించారు. ముంబైలో మారణహోమం నిర్వహించింది పాకిస్థాన్ ఉగ్రవాదులేనని ఆయన తొలిసారి అంగీకరించారు. ముంబై పేలుళ్ల సూత్రధారి పాకిస్థానేనని పరోక్షంగా తెలిపారు. అయితే, ఆ ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వంతో ప్రమేయం లేదని, పాక్‌లో క్రియాశీలకంగా ఉన్న ఉగ్రతండాలు రాజ్యేతర శక్తులని ఆయన ‘డాన్’ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
2008 నవంబర్ 26న పాక్ ఉగ్రవాదులు పదిమంది.. భారీ ఆయుధాలు, బాంబులతో విరుచుకుపడి.. ముంబైలో మారణహోమం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ భయానక ఉగ్రవాద దాడిలో తొమ్మిదిమంది ఉగ్రవాదులు సహా 166 మంది ప్రాణాలు కోల్పోయారు. సజీవంగా చిక్కిన ఉగ్రవాది కసబ్‌కు న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంతో.. అతన్ని ఉరితీశారు. ముంబైలో జరిగిన ఈ ఉగ్రదారుణంపై భారత్ ప్రభుత్వం ఎన్ని ఆధారాలు సమర్పించినా.. పాక్ మాత్రం తమ ప్రమేయం లేదని బుకాయిస్తూ వచ్చింది. ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హజీఫ్ సయీద్ అని స్పష్టమైన సాక్ష్యాధారాలు సమర్పించినా పాక్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మొండిగా ప్రవర్తించింది. ఇప్పుడు మాజీ ప్రధానమంత్రే 26/11 ముంబై దాడులు తమ పనేనని అంగీకరించడం పాక్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది.
Comments
Please login to add a commentAdd a comment