
ఇస్లామాబాద్ : పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ మళ్లీ ప్రధాని అయ్యే అవకాశాలను బతికించుకున్నారు. అక్రమాస్తులు, అవినీతి కేసులో ఇరుక్కొని పదవిని కోల్పోయిన ఆయన తిరిగి ఆ బాధ్యతల్లోకి వెళ్లేందుకు మార్గం సుగుమం చేసుకున్నారు. ఆయనను మరోసారి పాక్ అధికార పార్టీ అధ్యక్షుడిగా(పీఎంఎల్ ఎన్) నియమిస్తూ పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో పాక్ పార్లమెంటు ఓ వివాదాస్పద బిల్లును పాస్ చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తిరిగి రాజకీయాల్లోకి వచ్చేందుకు అవకాశం కోల్పోయిన నవాజ్.. తాజాగా పార్లమెంటు చేసిన చట్ట సవరణ బిల్లుతో ఆయనకు తిరిగి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం కల్పించింది. పీఎంఎల్‌ఎన్ పార్టీకి అధ్యక్షుడిగా తాము షరీఫ్‌ను ఎన్నుకుంటున్నామని పేర్కొంటూ అందుకు సంబంధించిన పత్రాలను పాక్ ఎన్నికల కమిషన్‌కు ఆ పార్టీ నేత తారిఖ్ ఫజల్ చౌదరీ అందించారు. మరో వ్యక్తి ఈ పదవికి పోటీపడటం లేదని స్పష్టం చేశారు. దీంతో 1976నాటి పాకిస్థాన్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం రాజకీయాల నుంచి వేటును ఎదుర్కొంటున్న నవాజ్‌కు మరోసారి ప్రవేశించే అవకాశం దక్కింది.