వాన..? వరద..? నో ప్రాబ్లమ్!
ఆ మధ్య ఒకరోజులోనే హైదరాబాద్‌ను ముంచేసిన వాన గుర్తుందా? పోనీ గత ఏడాది ఇదే టైమ్‌లో చెన్నైను చుట్టుముట్టిన వరదలు! గుర్తుండే ఉంటాయి లెండి! ఇలాంటి విపరీతమైన వాతావరణ సంఘటనలు ఇకపై కూడా తరచూ మనల్ని పలకరించునున్నాయి. థ్యాంక్స్ టు భూతాపోన్నతి (గ్లోబల్ వార్మింగ్), వాతావరణ మార్పులు! వీటిని ఎదుర్కొనేందుకు, నష్టాన్ని తగ్గించుకునేందుకు విపరీతమైన ప్లానింగ్ అవసరమవుతోంది. బ్రిటన్‌లో ఇప్పుడు జరుగుతున్నది ఇదే. అందుకు ప్రత్యక్ష నిదర్శనాలు పక్కనున్న ఫొటోలు.
అన్ని కాలాల్లో... ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా తట్టుకోగల ఇళ్లను డిజైన్ చేసేందుకు ‘రెసిలియంట్ హోమ్స్’ పేరుతో ఓ పోటీ నిర్వహించింది. అనేక ఆర్కిటెక్చర్ సంస్థలు, మాస్టర్ ప్లానర్లు ఈ పోటీలో పాల్గోన్నారు. చివరకు జేటీపీ ఆర్కిటెక్చర్, ఎడ్‌బార్స్‌లీ అనే పర్యావరణవేత్త కలిసి సిద్ధం చేసిన ఈ ఇళ్ల డిజైన్‌లకు అవార్డు దక్కింది. ‘ఆ... ఏముంది ఈ డిజైన్‌లో. అంతా మామూలేగా’ అనుకుంటున్నారా? కొంచెం ఆగండి.. వరద వచ్చే ప్రమాదముందీ అనుకోండి... చాలా ముందుగానే ఈ ఇంట్లోని వాళ్ల స్మార్ట్‌ఫోన్లలో ఎలర్ట్‌లు వచ్చేస్తాయి. ఆ వెంటనే వీరు సెల్లార్ ప్రాంతంలో ఉంచుకున్న కార్లు, ఇతర విలువైన వస్తువులను సురక్షితమైన ప్రాంతానికి తరలించుకోవచ్చు.
అంతేకాకుండా... ఈ ఇళ్లల్లో విద్యుత్తుకు సంబంధించిన పరికరాలు (ట్రాన్స్‌ఫార్మర్లు, బ్యాటరీలు గట్రా) మొదటి అంతస్తులో ఉంటాయి. ఫలితంగా వాన రాగానే ఇక్కడ కరెంటు అస్సలు పోదన్నమాట. పైకప్పును జాగ్రత్తగా చూస్తే అక్కడ సోలార్ ప్యానెల్స్ ఉన్న విషయమూ మనకు స్పష్టమవుతుంది. సో... అత్యవసర పరిస్థితుల్లోనూ రోజువారీ పనులేవీ పక్కనపెట్టాల్సిన పనిలేదు. పొరుగింటిలో ఏదైనా అనుకోని అవాంతరం ఏర్పడినా వారు క్షేమంగా పక్కింటిలోకి చేరేందుకూ ఏర్పాట్లు ఉన్నాయి. భలే డిజైన్ కదూ... అమరావతిలోనూ... హైదరాబాద్‌లోనూ ఇలాంటి ఇళ్లతో ఓ కాలనీ సిద్ధం చేస్తే బాగుంటుందేమో!