
తేడా ఒక శాతమే
ట్రంప్‌పై తగ్గుతున్న హిల్లరీ ఆధిక్యం: తాజా సర్వేలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో ఎనిమిది రోజుల్లో జరగనున్న తరుణంలో డెమోక్రటిక్ అభ్యర్థిని హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ మధ్య పోటీ హోరాహోరీగా మారింది. హిల్లరీ క్లింటన్ ఈ మెయిల్స్ వ్యవహారంపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు ఎఫ్‌బీఐ ప్రకటించడంతో ఆమె ప్రజాదరణ పడిపోతున్నట్లు సర్వేలు వెల్లడి చేస్తున్నాయి. ఇప్పటివరకూ ట్రంప్‌పై పైచేయి సాధించిన హిల్లరీ ఆధిక్యం తగ్గుతూ వస్తోంది. తాజా సర్వేల్లో హిల్లరీకి, ట్రంప్‌కు మధ్య తేడా రెండు రోజుల్లోనే ఒక శాతానికి పడిపోయింది. ఆదివారం ఏబీసీ, వాషింగ్టన్ పోస్టులు నిర్వహించిన సర్వేల్లో క్లింటన్‌కు 46 శాతం, ట్రంప్‌కు 45 శాతం ప్రజా మద్దతు లభించింది.
సీఎన్‌ఎన్ తాజా ఐదు పోల్ సర్వేల్లో సగటున హిల్లరీకి 47 శాతం, ట్రంప్‌కు 42 శాతం ఓట్లు లభించాయి. న్యూయార్క్ టైమ్స్, సినా కాలేజ్ రీసెర్చ్ సెప్టెంబర్‌లో నిర్వహించిన సర్వేలో ఫ్లోరిడా రాష్ట్రంలో వెనుకబడి ఉన్న ట్రంప్.. ప్రస్తుతం నాలుగు పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎఫ్‌బీఐ ఈ మెయిళ్లపై దర్యాప్తు చేయాలని నిర్ణయించడాన్ని హిల్లరీ క్లింటన్ తప్పుబట్టారు. దీనిపై డెమోక్రాట్లు, కొంతమంది రిపబ్లికన్లు సైతం విరుచుకు పడుతున్నారు.