
పాక్‌కు ఇండియాతో కొత్త భయం !
ఇప్పటికే తమ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయిన పాకిస్థాన్ తాజాగా భయంలోకి జారుకుంది.
ఇస్లామాబాద్ : ఇప్పటికే తమ విషయంలో అమెరికా కఠినంగా వ్యవహరిస్తుండటంతో తీవ్ర ఆందోళనలోకి కూరుకుపోయిన పాకిస్థాన్ తాజాగా భయంలోకి జారుకుంది. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ఆ దేశం వణికిపోతోంది. అది కూడా భారత్‌కు సంబంధించిన నిర్ణయం కావడంతో మరింత బెంబేలెత్తిపోతోంది. దాదాపు 2 నుంచి 3 బిలియన్ డాలర్ల అంచనా 22 ప్రిడేటర్ డ్రోన్లను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా ఈ ఏడాది జూన్‌లో తీసుకున్న నిర్ణయంతో పాక్ తెగ ఆందోళన చెందుతుందంట.
ముఖ్యంగా రక్షణ వ్యవహరాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ హెచ్చరికలు జారీ చేసే డ్రోన్‌లు కావడం వీటిని భారత సబ్‌మెరైన్‌లకు అనుసంధానించి పనిచేయించడం పాక్‌ను కొంత భయపెడుతోందని అక్కడి మీడియా చెబుతోంది. వారంతపు మీడియా సమావేశంలో భాగంగా పాక్ విదేశాంగ వ్యవహారాల అధికార ప్రతినిధి నఫీజ్ జకారియా తాజాగా మాట్లాడుతూ గత జూన్‌లో మోదీ చేసిన అమెరికా టూర్ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు. అత్యంత ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని మోదీ అమెరికా కుదుర్చుకున్నారని, అందులో జలాంతర్గాములకోసం ఉపయోగించే 22 డ్రోన్‌లకు ఒప్పందం కుదిరిందని ఆందోళన వ్యక్తం చేశారు.
దీంతో పాక్, భారత్‌కు మధ్య వ్యూహాత్మక బలం సమస్థాయిని కోల్పోయినట్లయిందని, ఇది భారత్ బలాన్ని పెంచినట్లు అవుతుందని చెప్పారు. 'మేం ఇప్పటికే భారత్‌కు అత్యాధునిక మిలిటరీ సాంకేతిక పరిజ్ఞానం విక్రయించడంపై మేం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశాం. అలా చేయడం ద్వారా ప్రాంతాల మధ్య బ్యాలెన్స్ తప్పి మొత్తం దక్షిణాసియాలోనే సుస్థిరత్వానికి ప్రమాదం ఉందని చెప్పాం' అని జకారియా చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలకు ఈ ఒప్పందం గేమ్ చేంజర్‌గా మిగలడంతోపాటు అమెరికాకు భారత్ అతిపెద్ద రక్షణ భాగస్వామిగా అవతరించనుంది.