9 నెలల చిన్నారిపై హత్యా నేరం.. ఇన్స్పెక్టర్ సస్పెన్షన్
లాహోర్: పాకిస్థాన్లో తొమ్మిదేళ్ల చిన్నారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం, కోర్టులో హాజరు పరచడం.. ఆ దేశ న్యాయ వ్యవస్థపై సందేహాలను రేకెత్తిస్తోంది. ఈ కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ ఖాసీఫ్ మహ్మద్ను సస్పెండ్ చేశారు.
మూసాఖాన్ అలియాస్ మహ్మద్ ఉమర్ అనే బుడతడిపై హత్యాయత్న నేరం అభియోగాలు మోపి లాహోర్ కోర్టులో హాజరపరిచిన విషయం తెలిసిందే. పేరు పిలవగా, ఏడుస్తున్న పిల్లాడిని ఎత్తుకుని అతని తాత కోర్టులోకి రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ సంఘటనపై న్యాయమూర్తి తీవ్రంగా స్పందించి పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. 'అంత చిన్న పిల్లాడిని ఏ కేసులోనైనా ఎలా నిందితుడిగా చేరుస్తారు? ఇలాంటి పోలీసులతో ఏం సాధించగలం' అంటూ కోర్టులో విస్మయం వ్యక్తం చేశారు. పిల్లాడికి వెంటనే బెయిలివ్వడంతో పాటు అతనిపై అభియోగాలను ఉపసంహరించారు.
పాకిస్థాన్లో ఉగ్రవాద చర్యలు మినహా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా చేర్చాలంటే వారి వయసు కనీసం 12 ఏళ్లు ఉండాలి. పోలీస్ అధికారి చట్టం కూడా తెలుసుకోకుండా కేసు నమోదు చేయడం పోలీస్ వ్యవస్థనే అభాసుపాలు చేసింది.
లాహోర్ లో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న హోరాహోరీని ఆపేందుకు వెళ్లిన పోలీసులపై ఒక వర్గం దాడి చేసింది. ఈ సంఘటనలో ఒక పోలీసు చనిపోయాడు. ఇప్పుడు అక్కడ ఉన్న వారందరిపై కేసులు నమోదయ్యాయి. అందులో ఈ బుడ్డోడు కూడా ఉన్నాడు.