
'నా పొలం మీదనుంచే ఉగ్రవాదులు వెళ్లారనుకుంటా'!
పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోని బమియాల్ సెక్టార్లో పంటపొలాల నుంచి పఠాన్ కోట్ కు వచ్చినట్లు తెలిసింది.
బమియాల్: పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి దిగిన జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు భారత్ సరిహద్దులోని బమియాల్ సెక్టార్లో పంటపొలాల నుంచి పఠాన్ కోట్ కు వచ్చినట్లు తెలిసింది. ఉల్లిగడ్డ, గోధుమ పంట పొలాల మధ్యలో నుంచి వారు వచ్చినట్లుగా స్పష్టమవుతోంది. 400 మీటర్ల నిడివిలో రెండు పాద ముద్రలు గుర్తించినట్లు ఆ పొలం యజమాని జస్పాల్ సింగ్ పక్కో ఎన్ఐఏ అధికారులకు చెప్పాడు. ఆ పాదముద్రలు చూసి అనుమానించిన అతడు తన ఫోన్లో ఫొటోలు తీసుకొని వెళ్లి సమీపంలోని పోలీస్ స్టేషన్లో చూపించినట్లు చెప్పారు.
ప్రస్తుతం ఈ కేసును విచారిస్తున్న జాతీయ భద్రతా సంస్థకు ఈ రైతు ఇచ్చిన సమాచారమే కీలకంగా మారింది. అతడు ఎన్ఐఏ అధికారులకు ఏం చెప్పాడంటే..'డిసెంబర్ 31న సాయంత్రం 4.30గంటల ప్రాంతంలో నా పొలానికి నీళ్లు పెట్టి వెళ్లాను. ఉదయాన్నే వచ్చి చూడగా బూటు ముద్రలు గుర్తించాను. ఆ సమయంలోనే ఇక్కాగర్ సింగ్ చనిపోయినట్లు నాకు తెలిసింది. నాకెందుకో అనుమానం వేసింది. ఆ బూటుగుర్తులు కూడా సాధారణంగా గ్రామస్తులుగానీ, బీఎస్ఎఫ్ జవాన్లుగానీ, ఆర్మీగానీ వేసుకొనేవాటితో పోలిస్తే చాలా పెద్దగా ఉన్నాయి. వెంటనేవాటిని ఫొటోలు తీసుకొని పోలీసుల వద్దకు వెళ్లాను' అని అతడు అధికారులకు వివరించాడు.