పాల్.. విమర్శలపాల్.. | Paul Rosolie calls off 'Enter the Anaconda' stunt after 1 hour | Sakshi
Sakshi News home page

పాల్.. విమర్శలపాల్..

Published Tue, Dec 9 2014 3:57 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM

పాల్.. విమర్శలపాల్.. - Sakshi

పాల్.. విమర్శలపాల్..

కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్లు తయారైంది అమెరికాకు చెందిన పాల్ రొసోలీ పరిస్థితి. ప్రపంచంలోనే అతి పెద్ద పాము అనకొండకు ఆహారమైపోతాను.. మనల్ని అది పూర్తిగా మింగేస్తే ఎలాగుంటుందో తెలుసుకుంటాను అంటూ పాల్ తన మాటలతో అందరిలోనూ ఆసక్తి రేపాడు. అనకొండ మింగినా.. తనకేమీ అవకుండా ఉండటానికి ఓ ప్రత్యేకమైన సూట్ తయారు చేయించానని.. దాని వల్ల తన ప్రాణాలకూ ఇబ్బంది ఉండదని చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 7న ఈ ఎపిసోడ్ డిస్కవరీ చానల్‌లో ‘ఈటెన్ అలైవ్’ పేరిట వస్తుందని ప్రచారం చేశాడు. దీంతో కోట్లాది మంది ఈ కార్యక్రమం కోసం ఎదురుచూశారు. చూసిన తర్వాత.. పాల్‌పై సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోశారు. ఇంతకీ  ఆ షోలో ఏం చూపించారంటే..
 
 -  అమెజాన్ నదీ పరిసరాల్లో పాల్, అతని టీం అనకొండను వెతుకుతూ బయల్దేరారు. వారికి 20 అడుగుల పొడవున్న పచ్చ అనకొండ కనిపించింది. ప్రత్యేకమైన సూట్‌ను ధరించిన పాల్.. అనకొండ తనవైపు ఆకర్షితమయ్యేలా చేసేందుకు సూట్‌పై పంది రక్తాన్ని జల్లుకున్నాడు. నాలుగు కాళ్ల మీద నడుస్తున్నట్లుగా దాని ముందుకు వెళ్లాడు. అనకొండ వెంటనే అతడి తల భాగాన్ని నోటితో మింగడానికి ప్రయత్నించింది. శరీరాన్ని చుట్టేసింది. దీంతో పాల్‌కు తన చేతులు విరిగిపోతాయేమో అన్న భయం వేసింది. అతడి తల కొంచెం పాము నోట్లోకి వెళ్లిందో లేదో.. చేతులెత్తేశాడు. తనను రక్షించాలంటూ టీమ్‌కు సంకేతాలిచ్చాడు. దాంతో వారొచ్చి అనకొండ నోటి నుంచి ఇతడిని బయటకు లాగారు.
 
 -  ఇది చూడటానికే ఈ కార్యక్రమానికి ఇంత ప్రచారమా అంటూ నెటిజన్లు డిస్కవరీ చానల్, పాల్‌పై అంతెత్తున లేచారు. తమ సమయమంతా వేస్ట్ చేశారని మండిపడ్డారు. పాల్ తన దేశ ప్రజలకు తలవంపులు తెచ్చాడని మరికొందరు వ్యాఖ్యానించారు. కొందరైతే.. తమ కుక్క నోట్లో వేలు పెట్టిన ఫొటోలు పోస్ట్ చేసి.. ‘డిస్కవరీ చానల్.. ఈటెన్ అలైవ్.. నా పేరిట కూడా షో ప్రసారం చేయరూ’ అంటూ వ్యంగ్య వ్యాఖ్యానాలు చేశారు. అటు పాల్ మాత్రం అనకొండల సంరక్షణకు నిధుల సేకరణ నిమిత్తమే తానీ సాహసానికి పూనుకున్నానని.. ఈ దిశగా ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి కార్యక్రమాన్ని చేశానని వివరణ ఇచ్చుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement