చైనాలో ‘చావు’ ట్రెండ్
బీజింగ్: చైనాలో ఇటీవల ‘చావు’ ట్రెండ్ మొదలైంది. చనిపోయిన తర్వాత మనిషి ఎలా ఫీలవుతాడు? ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ప్రత్యక్షంగా అనుభవించాలనుకోవడమే ఆ ట్రెండ్. అందుకోసం వారు కఫిన్‌లో దూరి కళ్లు మూసుకుంటున్నారు. చచ్చినట్లు శవంలా పడుకుంటున్నారు. ఎవరు ఎక్కువసేపు చచ్చిన శవంలా పడి ఉండే అదో మరచిపోలేని అనుభూతి. అదో సంతృప్తి. ఇటీవల ప్రజల్లో బాగా పెరిగిన ఈ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు ‘డెత్’ పార్లర్లు దేశవ్యాప్తంగా పుట్టుకొచ్చాయి. కొన్ని పార్లర్లయితే ఏకంగా అచ్చం శవానికి జరిగినట్లుగానే నకిలీ అంత్యక్రియలు కూడా జరపుతున్నాయి. శాంఘైలో ‘ది సమాధి’ అంటూ ఓ థీమ్ పార్క్‌ను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ నిజంగా చావు అనుభూతిని తెలుసుకునేందుకు 4డెమైన్షన్ స్టిమ్యులేటివ్ సిస్టమ్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ చావు ట్రెండ్‌కు మరింత ప్రచారం కల్పించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నారు. గత శుక్రవారం టియాంజిన్ సిటీలో ‘ఎక్స్‌పీరియెన్సింగ్ డెత్’ పేరిట చావును చూపించారు. విద్యార్థులు సహా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. వారు కఫిన్‌లో మౌనంగా వీలైనంత సేపు గడిపి అనంతరం బయటకు వచ్చాక తమ అనుభూతిని ఇతరులతో పంచుకున్నారు. అలా చచ్చిన శవంలా పడుకోవడం వల్ల తమ బాధలన్నింటినీ మరచిపోయామని, బయటకు వచ్చాక మనుసు తేలికపడ్డట్టుగా, ఎంతో ప్రశాంతంగా అనిపించిందని కూడా వారు చెప్పడం విశేషం.
చైనాలోని చాంగింగ్ నగరంలో కూడా మార్చి 27వ తేదీన ఇలాంటి ఈవెంట్‌నే నిర్వహించారు. అక్కడ కాఫిన్లకు ‘డ్రంక్ డ్రైవర్’ అని ‘డ్రంకెన్ స్టూపర్’ లేబుళ్లు కూడా తగిలించారు. దక్షిణ కొరియాలో కూడా ఈ ట్రెండ్ ఉంది. అక్కడ పదంటే పది నిమిషాలు కఫిన్లో పడుకొని చూట్టూ ఉన్న చీకటిని, ప్రశాంతతను అనుభూతి చెందుతారు.