న్యూయార్క్: సముద్రపు నీరు కలుషితం అవుతున్న విషయం మనకు ఇప్పటికే తెలుసు. సముద్రం నీటి నుంచి తయారవుతున్న ఉప్పు కూడా కలుషితం అవుతున్న కొత్త విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. లండన్, యూరప్, అమెరికా, చైనా దేశాల్లో విక్రయిస్తున్న సముద్రపు ఉప్పులో చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు కనిపించాయి. విక్రయ కేంద్రాల్లో కలుస్తున్నది కాదని, సముద్రంలోనే కలుస్తుందన్న విషయం సముద్ర ఉప్పు క్షేత్రాల్లో శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల చేపల్లో కూడా చిన్న చిన్న ప్లాస్లిక్ ముక్కలు ఉంటున్న విషయాన్ని కూడా శాస్త్రవేత్తలు ఇటీవలనే కనుగొన్నారు.
మైక్రోవైబర్స్, ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ బాటిల్ లాంటి వాటివల్ల ఈ ప్లాస్టిక్ కాలుష్యం పెరిగిపోతోందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్లాస్టిక్ ఒక్క వాతావరణాన్నే కాకుండా గాలిని, నీరును, మనం తినే ఉప్పు, ఆహారాన్ని ఎక్కువగా కలుషితం చేస్తోందని న్యూయార్క్ యూనివర్శిటీ ప్రొఫెసర్ షెర్రీ మాషన్ తెలిపారు.
ఒకసారి ప్లాస్టిక్ సముద్రపు నీటిలో కలిస్తే అది విషవాయువులకు, విష పదార్థాలకు అయస్కాంతంలా మారుతోందని ఆమె తెలిపారు. ఫలితంగా మంచినీళ్లలో, బీరుల్లో ప్లాస్టిక్ ముక్కలు వచ్చి చేరుతున్నాయని చెప్పారు. ఓ మనిషి శరీరంలోకి సరాసరిన సంవత్సరానికి 660 ప్లాస్టిక్ ముక్కలు పోతున్నాయని అన్నారు. అయితే వాటివల్ల మానవ ఆరోగ్యానికి కలుగుతున్న నష్టమేమిటో ఇంకా అధ్యయనం చేయాల్సి ఉందని ఆమె చెప్పారు.