
ఐక్యరాజ్య సమితి: పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య చర్చలు సాధ్యమైనంత త్వరగా పునఃప్రారంభం కావాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి భారత్ మద్దతు ఉంటుందని ఉద్ఘాటించారు. ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’ సందర్భంగా మోదీ ఐరాసకు ఓ సందేశం పంపారు. ఇజ్రాయెల్‌తో పాటు శాంతియుతంగా జీవనం సాగించే స్వతంత్ర, సార్వభౌమ, సుస్థిర పాలస్తీనా కల త్వరలోనే నిజం అవుతుందని భారత్ ఆశిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
‘సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా పాలస్తీనా, ఇజ్రాయెల్‌ల మధ్య త్వరలో చర్చలు ప్రారంభమవుతాయని భారత్ ఆశిస్తోంది. రెండు దేశాలు పరస్పరం శాంతియుతంగా కొనసాగే విధానాన్ని విశ్వసిస్తున్నాం’ అని మోదీ అన్నారు. పాలస్తీనా అభివృద్ధికి భారత్ అందిస్తున్న సాంకేతిక, విద్య సహకారాన్ని మోదీ గుర్తుచేశారు. ‘పాలస్తీనా అభివృద్ధి, పునర్నిర్మాణానికి భారత్ మద్దతు కొనసాగుతుంది.
అక్కడ మానవ వనరుల అభివృద్ధి కోసం విద్యా ఉపకారవేతనాలను రెట్టింపు చేశాం. అలాగే ఇండియన్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కో–ఆపరేషన్ కార్యక్రమం కింద ఏటా శిక్షణ కార్యక్రమాలను 100 నుంచి 150కి పెంచాం’ అని మోదీ వెల్లడించారు. 1979 నుంచి ఏటా నవంబర్ 29ని ‘యూఎన్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సాలిడారిటీ విత్ పాలస్తీనా పీపుల్’గా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక సమావేశం జరుగుతుంది.