
మనీలా : పిలిప్పీన్స్‌లోని ఓ ప్రముఖ వాణిజ్య పట్టణంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మకాటి నగరంలోని రద్దీగా ఉన్న ఓ రోడ్డు పక్కనే ఉన్న బిల్ బోర్డులో అనూహ్యంగా అశ్లీల చిత్రం ప్రసారం అయింది. దాదాపు అరనిమిషంపాటు ఇది ప్రసారం కావడంతో వాహనదారులు నిర్ఘాంతపోయారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. క్షణాల్లో ఈ విషయం నగర మేయర్‌కు తెలిసి దానిని అప్పటికప్పుడు నిలుపుదల చేయించారు. అయితే, అప్పటికే ఆ దృశ్యాలను వివిధ వాహనాల్లో వెళుతున్న వారు తమ ఫోన్‌లలో బందించడంతో ఇప్పుడవి వైరల్‌గా మారాయి.
దీనిపై మకాటి మేయర్ వివరణ ఇస్తూ అనుకోకుండా ఈ సంఘటన జరిగిందని, తాము దర్యాప్తునకు ఆదేశించామని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే ఆ బిల్‌బోర్డును పనిచేయకుండా ఆపేశామని, అయితే, అప్పటికే వాహనదారులు తమ ఫోన్‌లలో వాటిని బందించడంతో వైరల్ అయ్యాయని చెప్పారు. దర్యాప్తులో బిల్ బోర్డు యజమాని పేరును, ఆపరేటర్లు, ఇతర ఉద్యోగులను కూడా బాధ్యులుగా చేర్చినట్లు చెప్పారు. పిలిప్పీన్స్‌లో పోర్నోగ్రఫీ చట్టరిత్యా నేరం. టీవీల్లో, సినిమాల్లో అలాంటి దృశ్యాలు ఏ మాత్రం లేకుండా వారు జాగ్రత్తలు పడతారు.. వాటి నిషేధం కోసం కఠిన చట్టాలు అమలు చేస్తున్నారు. అలాంటిది బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన ఓ బిల్‌బోర్డుపై ఏకంగా పోర్నోగ్రపి చిత్రం ప్రసారం కావడం కలకలం రేపుతోంది.