
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో విజయానికి రష్యాతో కలిసి కుట్రపన్నారన్న ఆరోపణలు అర్థరహితమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. ఈ వివాదంపై విచారిస్తున్న ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్, స్పెషల్ కౌన్సెల్ రాబర్ట్ ముల్లర్‌తో ముఖాముఖి ఇంటర్వ్యూ ఉండకపోవచ్చని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. ‘అమెరికా, రష్యా మధ్య ఎలాంటి సంబంధాల్లేనపుడు దీనిపై విచారణ జరపాల్సిన పనేముంది. నాతో ఇంటర్వ్యూ అవసరమేంటి’ అని ట్రంప్ పేర్కొన్నారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత డెమొక్రాట్లు అర్థరహితమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. 11 నెలలుగా వివిధమార్గాల్లో ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2016లో ఈ–మెయిల్ కేసుకు సంబంధించి హిల్లరీ క్లింటన్‌ను ఎఫ్‌బీఐ విచారణ జరిపిన విషయాన్ని మరిచిపోవద్దని ట్రంప్ తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే పలువురు ట్రంప్ కుటుంబ సభ్యులు, సన్నిహితులను ముల్లర్ విచారించారు. ట్రంప్‌ను ఇంటర్వ్యూ కోసం ముల్లర్ అపాయింట్‌మెంట్ కోరుతున్నారంటూ వార్తలొస్తున్న నేపథ్యంలో ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు.