
మృత్యు విలయం
కాబుల్/ఇస్లామాబాద్: హిందూఖుష్ పర్వత శ్రేణులు కేంద్రంగా సంభవించిన భూకంపం అటు అఫ్ఘానిస్థాన్ నే కాక పాకిస్థాన్ లోనూ ఘోర విషాదానికి కారణమైంది. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఇరుదేశాల్లో మృత్యువాతపడిన వారి సంఖ్య 180కి పెంరిగింది. ఇందులో ఎక్కువ మరణాలు పాకిస్థాన్ లో చోటుచేసుకున్నవే కావడం గమనార్హం. చిన్నా, పెద్దా ఆసుపత్రులన్నీ క్షతగాత్రులతో నిండిపోయాయి. దాదాపు 5 వేల మందికిపైగా గాయపడి ఉండొచ్చని అంచనా.
వాయివ్య పాకిస్థాన్ లోని ఖైబర్, బుజర్ ప్రాంతాల్లో భూకంప ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ రెండు ప్రావిన్స్ లలోనే దాదాపు 147 మంది ప్రాణాలు కోల్పోయారు. రావల్పిండిలోనూ పలు భవనాలకు బీటలు ఏర్పడ్డాయి. టకార్ ప్రావిన్స్ లోని స్కూల్ లో తొక్కిసలాటలో మరణించిన 12 మంది విద్యార్థినులు సహా అఫ్ఘానిస్థాన్ లో 51 మంది మృత్యువాతపడ్డారు.
7.5 తీవ్రతతో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ వెంటనే మరో నాలుగు నిమిషాలకు 4.8 తీవ్రతతో మరోసారి భూమి కంపించింది. మొదటి కంపానికే వేలాది భవనాలు నేలమట్టం కాగా, రెండో భూకంపం.. ఆ శిథిలాలు మరింత కూరుకుపోయేందుకు కారణమయింది. దీంతో శిథిలాల కింద చిక్కుకుపోయినవారిని కాపాడటం కష్టంగా మారింది.
హిందూఖుష్ పర్వత శ్రేణుల్లో తరచూ భూమి కంపిస్తుండటం సహజమే అయినప్పటికీ సోమవారం నాటి భూకంపం మాత్రం అత్యంత భారీ (రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా) భూకంపమని యూఎస్ జియాలాజికల్ సర్వే తెలిపింది. 2005లో కశ్మీర్ లోయ కేంద్రంగా (7.6 తీవ్రతతో) సంభవించిన భూకంపం.. భారత్, అఫ్ఘానిస్థాన, పాకిస్థాన్ దేశాల్లోని 80 వేల మందిని బలితీసుకున్న సంగంతి తెలిసిందే.