కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తీవ్ర భూకంపం కుదిపేసింది. బుధవారం తెల్లవారుజామున విరుచుకుపడ్డ ఈ ఉత్పాతంలో ఇప్పటిదాకా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1,500 మందికి పైగా గాయపడ్డారు. తూర్పు అప్ఘాన్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని కొండ ప్రాంతాల్లో వచ్చిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఖోస్ట్ నగరానికి 46 కి.మీ. దూరంలో, రాజధాని కాబూల్‌కు దక్షిణంగా 150 కి.మీ.దూరాన ఉన్న కొండ ప్రాంతం కేంద్రంగా భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీసీ) వెల్లడించింది. పాకిస్తాన్, ఇరాన్, భారత్‌ల్లోనూ భూ ప్రకం పనలు సంభవించాయని యూరోపియన్ సిస్మలాజికల్ ఏజెన్సీ తెలిపింది. మృతుల సంఖ్య భారీగా పెరగవచ్చని అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి సలాహుద్దీన్ అయూబీ చెప్పారు. మారుమూల కొండ ప్రాంతాలకు వెళ్లి సహాయం అందించడానికి మరింత సమయం పడుతుందన్నారు.
సవాలుగా సహాయ కార్యక్రమాలు
అఫ్గానిస్తాన్‌లో 10 నెలల కింద ఏర్పడ్డ తాలిబన్ల ప్రభుత్వ పనితీరుకి ఈ భూకంపం సవాలుగా మారింది. అధికార యంత్రాంగం హుటాహుటిన సహాయ చర్యలు ప్రారంభించింది. కొండ ప్రాంతాల్లో బాధితుల సహాయానికి హెలికాఫ్టర్లు పంపారు. క్షతగాత్రుల్ని ఆసుపత్రులకు తరలించారు. హెలికాప్టర్ల కొరత, కొండ ప్రాంతాలకు వెళ్లడం దుర్లభం కావడంతో సహాయ చర్యలు మందకొడిగా సాగుతున్నాయి.
అంతర్జాతీయ సాయం కోరిన తాలిబన్లు
అఫ్గాన్ ప్రజలు తీవ్రమైన విషాదంలో ఉన్నారని ప్రపంచ దేశాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి సాయపడాలని తాలిబన్ సుప్రీం నాయకుడు హైబతుల్లా అఖూన్‌జాదా విజ్ఞప్తి చేశారు. ప్రధాని మహమ్మద్ హసన్ అఖుండ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సహాయ కార్యక్రమాలను సమీక్షించారు. 1998లో అఫ్గాన్‌ను కుదిపేసిన భారీ భూకంపంలో 4,500 మందికి పైగా మరణించారు. ఆ తర్వాత అతి పెద్ద భూకంపం ఇదేనని భక్తర్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
నాసిరకం నిర్మాణాలతో భారీగా ప్రాణనష్టం
మారుమూల కొండల్లో ఉన్న గ్రామాల్లో నాసి రకం నిర్మాణాలు కావడం, , కొండ చరియ లు విరిగిపడే ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో భూకంప ధాటికి అపారమైన నష్టం జరిగింది. రాళ్లు, మట్టితో నిర్మిం చిన వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. గాఢ నిద్రలో ఉన్న వారి బతుకులు శిథిలాల కింద పడి తెల్లారిపోయాయి. ఫక్తూన్ క్వా ప్రావిన్స్‌లో అత్యధిక మరణాలు సంభవించినట్టు ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ భక్తర్ వెల్లడించింది. అక్కడ మీడియాలో వస్తున్న భూకంప విధ్వంస దృశ్యాలు అందరినీ కలిచివేస్తున్నాయి. రాళ్ల మధ్య నలిగిపోయిన మృతదేహాలు, ప్రాణాలతో ఉన్న వారు శిథిలాల నుంచి బయటకు రావడానికి చేస్తున్న ప్రయత్నాలు హృదయవిదారకంగా మారాయి.
JUST IN 🚨 Afghanistan state-run news agency reports more than 150 people killed in #earthquake in country's eastern province.
— Insider Paper (@TheInsiderPaper) June 22, 2022
pic.twitter.com/QIQFGtQanf
Comments
Please login to add a commentAdd a comment