నల్లవాళ్లను తెల్లగా ఇలా మారుస్తారా?
ప్రకటనలు ఇవ్వడం అంటే.. వినియోగదారులను తమ ఉత్పత్తుల వైపు ఆకట్టుకోవడమే. కానీ, అందులో అతి చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఈ విషయం చైనాలోని ఓ లాండ్రీ డిటర్జెంట్ కంపెనీ ప్రకటనతో మరోసారి రుజువైంది. జాతి దురహంకారానికి ప్రతీకగా కనిపిస్తున్న ఈ ప్రకటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో జనం భగ్గుమంటున్నారు. చైనాలోని కియోబీ అనే లాండ్రీ డిటర్జెంట్ బ్రాండ్ ఇటీవలే ఈ ప్రకటన విడుదల చేసింది. ఓ యువతి దుస్తులు ఉతికేందుకు వాషింగ్ మిషన్ వద్దకు వచ్చినప్పుడు.. ఆమెకు ఓ నల్లటి యువకుడు కన్నుకొడతాడు. ఆమె అతడిని దగ్గరకు పిలుస్తుంది. ముద్దు ఇవ్వడానికి పిలిచిందేమోనని ఆశగా ముందుకొచ్చిన ఆ యువకుడిని ఊరిస్తూ నెమ్మదిగా వాషింగ్ మిషన్‌లోకి తోసేసి దాని పైకెక్కి నవ్వుతూ కూర్చుంటుంది.
కాసేపటి తర్వాత వాషింగ్ మిషన్ మూత తీసి చూస్తే.. అతడు తెల్లటి చైనీస్ వ్యక్తిలా మారిపోతాడు. చైనా టీవీలో ఈ ప్రకటన ఈ నెలలోనే ప్రసారమైంది. కొన్ని థియేటర్లలో కూడా ఇది రావడంతో వెంటనే ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఇది చాలా జాత్యంహకార పూరితంగా ఉందని జనం భగ్గుమంటున్నారు. ప్రధానంగా ఆఫ్రికా జాతులకు చెందినవాళ్లను కించపరిచే ఇలాంటి ప్రకటనలను ఎలా ఇవ్వనిస్తున్నారని మండిపడుతున్నారు. ఇంతకుముందు 2007లో ఒక ఇటాలియన్ కంపెనీ కూడా ఇలాంటి ప్రకటనే ఇచ్చిందట. అయితే అప్పట్లో తెల్లటి వ్యక్తి నల్లగా మారిపోతాడు. కొత్త స్టార్ వార్స్ సినిమా పోస్టర్లలో కూడా అమెరికాలో అయితే నల్లజాతి నటుడు జాన్ బోయెగా ప్రముఖంగా కనిపిస్తాడు. కానీ చైనాలోని పోస్టర్లలో మాత్రం అతడిని అంతగా కనపడనివ్వకుండా ఇచ్చారు.