
అరుదైన కంపించే నక్షత్రం!
సూర్యుడి పరిమాణంలో ఉండి కంపించగల ఓ అరుదైన నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
వాషింగ్టన్: సూర్యుడి పరిమాణంలో ఉండి కంపించగల ఓ అరుదైన నక్షత్రాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ భారీ నక్షత్రం ఏడు వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు అమెరికాలోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఫార్లే ఫెర్రాంటీ తెలిపారు. ఈ నక్షత్రం మూడు వేర్వేరు దిశల్లో కంపించగలదని (సంకోచించడం, వ్యాకోచించడం) చెప్పారు.
మన పాలపుంతలో దాదాపు వంద బిలియన్ల కంటే ఎక్కువ నక్షత్రాలు ఉన్నాయని, కానీ ఇలాంటి అరుదైనవి కేవలం ఏడు మాత్రమే ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. అందులో ప్రస్తుతం కనుగొన్న నక్షత్రం ఒకటి అని తెలిపారు. వక్రంగా ఉండే ఈ నక్షత్రాలు విశ్వం గురించి, దాని మూలాల గురించి మరింత అధ్యయనం చేసేందుకు తోడ్పడతాయి.