
పెట్ట పని ఏంటి.. గుడ్లు పెట్టడం.. ఒలివియా కూడా అదే పని చేసింది..కొన్ని నెలల క్రితం వరకూ.. మరిప్పుడో.. గుడ్లు పెట్టడం మానేసి.. పుంజులతో గొడవలకు పోతోంది.. తెల్లారకముందే.. కొక్కొరోకో అంటూ చుట్టపక్కలోళ్ల నిద్ర చెడగొడుతోంది..
ఎందుకలా..
ఎందుకంటే.. ఆ పెట్ట కాస్తా ఇప్పుడు పుంజుగా మారింది!
ఇదెట్టా??
ఆస్ట్రేలియాలోని కామ్డెన్‌లో ఉండే ఒలివియా అకస్మాత్తుగా గుడ్లు పెట్టడం మానేయడం.. నెమ్మదిగా పుంజులాగతురాయి పెరగడం చూసి.. దాని యజమానులు డంగైపోయారు.. సంబంధిత వైద్యుల దగ్గరకు తీసుకెళ్తే.. ఇదో అరుదైన సిండ్రోమ్ అని.. ప్రతి పది వేల పెట్టల్లో ఒకదానికి ఇలా జరుగుతుందని చెప్పారు. దీని అండాశయంలోని కుడివైపు భాగం సరిగా అభివృద్ధి చెందలేదని.. దీనికితోడు టెస్టోస్టిరోన్ హార్మోన్ ప్రభావమూ ఉందని తెలిపారు. మళ్లీ పెట్టగా మార్చాలంటే.. హార్మోన్ల చికిత్స ఒక్కటే మార్గమని తేల్చారు.
ప్రస్తుతం ఆ చికిత్స కొనసాగుతోంది.. కొంచెం కొంచెంగా పుంజు కాస్తా పెట్టగా మారుతోందట.. దాని యజమానులు మాత్రం ఇది పూర్తిగా పెట్టగా ఎప్పుడు మారుతుందో.. మళ్లీ గుడ్లెప్పుడు పెడుతుందో అని గుడ్లేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు.