కుటుంబీకుల ఆత్మహత్యతో విలపిస్తున్న ఓ మహిళ
సాక్షి, న్యూఢిల్లీ : మెక్సికోలో గత దశాబ్దం నుంచి ప్రపంచంలోకెల్లా ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. దేశంలోని మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాలను, నేరస్థుల ముఠాలను అణచివేసేందుకు గత 12 ఏళ్లుగా అక్కడి ప్రభుత్వం అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగానే హత్యలు పెరిగాయి. ఒక్క 2017 సంవత్సరంలోనే ఆ దేశంలో 30 వేల హత్యలు చోటు చేసుకున్నాయి. 2018, మే నెల గత 20 ఏళ్లలో అత్యంత రక్తపాత మాసంగా చరిత్రకెక్కింది. ఆ నెలలో సరాసరి రోజుకు 90 హత్యలు జరిగినట్లు మెక్సికో హోంశాఖ లెక్కలే తెలియజేస్తున్నాయి.
గత జూలై నెలలో జరిగిన సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎక్కువ మంది హత్యలకు గురయ్యారు. వారిలో రాజకీయ నాయకులతోపాటు 136 మంది పోలీసులు ఉన్నారు. 43 మంది విద్యార్థి టీచర్లు అదృశ్యమయ్యారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఎనిమిది మంది జర్నలిస్టులు హత్యలకు గురయ్యారు. తీవ్రమైన హత్యాకాండ, హింసాకాండ పరిస్థితులను తట్టుకోలేక ఇప్పుడు ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఉత్తర మెక్సికో నుంచి తాజాగా అందిన ఓ నివేదిక తెలియజేసింది.
జ్వారెజ్ నగరంలోని ఓ వీధి
అమెరికా సరిహద్దుకు ఆనుకొని ఉన్న మెక్సికో నగరం స్యూడడ్ జ్వారెజ్ ప్రపంచంలోనే అత్యంత భయానక నగరంగా పేరుగాంచింది. అక్కడ ఒక్క 2010లోనే ప్రతి లక్ష మందిలో 229 మంది హత్యకు గురయ్యారు. ఇది లాటిన్ అమెరికాలో జరిగే హత్యలకన్నా 14 రెట్లు, ప్రపంచ సగటు హత్యలకన్నా 38 రెట్లు ఎక్కువ. ఈ నగరంలో ప్రస్తుతం వారానికి 70 మంది స్థానికులు హత్యలకు గురవుతున్నారు. ఇటీవలి కాలంలో జ్వారెజ్‌లో హత్యలు తగ్గుముఖం పట్టగా ఆత్మహత్యలు పెరగడం విచారకరం. జ్వారెజ్ సిటీ యూనివర్శిటీ ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతి రోజు 18 ఏళ్లు దాటిన 33 మంది నగరవాసులు ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారట. 43 మంది ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచిస్తున్నారట. గతేడాది దాదాపు 12 వేల మంది ఆత్మహత్యలకు ప్రయత్నించారట.
గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాల కోసం సామూహిక సమాధులకు ఏర్పాట్లు
అటు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు సంబంధించి, ఇటు వివిధ రకాల నేరాలకు సంబంధించి జరుగుతున్న దారుణ హత్యల ప్రభావం కారణంగానే ఎక్కువ మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో తేలింది. జ్వారెజ్ నగరాన్ని ఒకప్పుడు ప్రపంచంలోనే ఎక్కువ హత్యలు జరిగే నగరంగా పిలవగా ఇప్పుడు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్న నగరంగా పిలుస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment