దొంగ తెలివితో అడ్డంగా బుక్కయ్యాడు
న్యూజిలాండ్: సీసీటీవీ కెమెరాలు వచ్చిన తర్వాత దొంగలకు ఊపిరాడట్లేదేమో. గతంలో దొంగతనం చేస్తే కొన్ని రోజులపాటు ఆ దొంగ సొమ్మును అనుభవించే వరకు పోలీసులకు దొరికే వారు కాదు. కానీ, ఈ రోజుల్లో మాత్రం వారి పరిస్థితి అందుకు భిన్నంగా తయారైంది. అలా దొంగతనం చేశారో లేదో ఇలా పట్టుబడిపోతున్నారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల పుణ్యమే. దీంతో ఇప్పుడు దొంగతనాలు చేయడానికి దొంగలు చిత్రవిచిత్రమైన ఆలోచనలు చేస్తున్నారు. ఇంట్లో మనుషులకు భయపడకుండ సీసీటీవీ కెమెరా నుంచి బయటపడేందుకు కొత్త మార్గాలు అనుసరిస్తున్నారు.
అది న్యూజిలాండ్లోని డాన్నేమోరాలోల ఆక్లాండ్ సుబర్బ్. అక్కడ ఓ ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఓ దొంగ ఆ ఇల్లు మొత్తాన్ని దోచుకోవాలని అనుకున్నాడు. సీసీటీవీ కెమెరాకు ఎట్టి పరిస్థితుల్లో చిక్కకూడదని నిర్ణయించుకొని ఆ ఇంట్లో చిన్న పిల్లాడికి కప్పి దుప్పటి తీసుకొని తనకు కప్పుకున్నాడు. అనంతరం అచ్చం చిన్నపిల్లాడి మాదిరిగా మొకాళ్లపైనే ఇంట్లో పాకుతూ డబ్బు, నగలు దోచుకున్నాడు.
అయితే, ఏం ఆలోచన వచ్చిందో ఏమో.. ఇంతకీ నేను సీసీటీవీ కెమెరాలో కనిపిస్తున్నానా అనుకొని కొంచెం దుప్పటి జరిపి దానివైపు చూశాడు. దాంతో అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఆ సీసీటీవీ ఆధారంగానే అతడి ముఖాన్ని గుర్తించిన పోలీసులు ఫొటోను అన్ని చోట్ల అంటించి దయచేసి అతడి వివరాలు తెలిస్తే చెప్పండంటూ ప్రజలకు చెప్పారు.