తండ్రిని చంపి.. ఆపై స్కూల్లో కాల్పులు
ఓ యువకుడు తన తండ్రిని ఇంట్లోనే కాల్చి చంపి.. ఆపై సమీపంలో ఉన్న ఎలిమెంటరీ స్కూలుకు వెళ్లి అక్కడ హ్యాండ్‌గన్‌తో కాల్పులు జరిపాడు. దాంతో ఇద్దరు విద్యార్థులు, ఒక టీచర్ గాయపడ్డారు. ఈ ఘటన అమెరికాలో గన్ కల్చర్‌పై మరోసారి చర్చకు దారితీసింది. అట్లాంటాకు ఈశాన్యంగా 110 మైళ్ల దూరంలో ఉన్న టౌన్‌విల్లె అనే గ్రామీణ ప్రాంతంలో కాల్పులు మొదలైన కొద్ది నిమిషాలకే పోలీసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులలో ఒకరికి కాలిలో బుల్లెట్ గాయం కాగా, మరొకరికి పాదంలో తగిలిందని కెప్టెన్ గార్లండ్ మేజర్ తెలిపారు. ఇక ఓ ఉపాధ్యాయినికి భుజంలో బుల్లెట్ దిగింది.
అమెరికా కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 1.45 గంటల సమయంలో కాల్పులు మొదలయ్యాయి. దానికి ముందు అతడు తన ఇంట్లో తండ్రి జెఫ్రీ ఆస్బోర్న్ (47)ను కాల్చి చంపాడు. తర్వాత అక్కడి నుంచి రెండు మైళ్ల దూరంలో ఉన్న స్కూలుకు వెళ్లి కాల్పులు జరిపాడు. అయితే అతడు ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడిందీ ఇంకా తెలియడంలేదు. కాల్పులు ముగిసి, యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్న వెంటనే పిల్లలను సమీపంలో ఉన్న చర్చికి బస్సులో పంపేశారు. అక్కడ వాళ్ల తల్లిదండ్రులు ఉండి, పిల్లలను తీసుకున్నారు. స్కూల్లో నర్సరీ నుంచి ఆరో తరగతి వరకు చదివే 300 మంది విద్యార్థులున్నారు.