సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ యువతీ యువకులను ఏమీ చేయలేదని, 50 ఏళ్లు దాటిన మధ్య వయస్కులకు, 60 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే ప్రాణాంతకమని, అది కూడా ఊపిరితిత్తులు, క్యాన్సర్, మధుమేహం లాంటి జబ్బులతో బాధ పడుతున్న వారికేనంటూ ప్రపంచవ్యాప్తంగా వైద్యులు ఇంతకాలం చెబుతూ వచ్చారు. అది ఒట్టి అపోహ మాత్రమేనని, కరోనా వైరస్ అన్ని వయస్కుల వారికి ప్రాణాంతకమని ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటోన్న మృతుల వివరాలను విశ్లేషిస్తే సులభంగానే అవగమవుతోంది. (కరోనాపై గెలుపు: ఇటలీలో అద్భుతం)
పోర్చుగల్ దేశంలోని దక్షిణ పోర్టో ప్రాంతానికి చెందిన విటార్ గోడిన్‌హో అనే 14 ఏళ్ల బాలుడు కరోనా బారిన పడి ఆదివారం ఉదయం శాంటా మారియా డా ఫియెరా ఆస్పత్రిలో మరణించారు. ఆయన ఇంతకుముందే సొరియాసిస్‌తో బాధ పడుతున్నప్పటికీ అనారోగ్య సమస్యలేమీ లేవని డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రపంచంలో కరోనా బారిన పడి మరణించిన అత్యంత పిన్న వయస్కుడే ఆ బాలుడే కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. వారం రోజుల క్రితమే జూలి ఆలియట్ అనే 16 ఏళ్ల బాలిక కరోనా వైరస్ బారిన పడి మరణించారు. ఆమెకు గతంలో ఎలాంటి జబ్బులు లేవని, స్వల్ప దగ్గుతో బాధ పడుతున్న స్కూల్ గర్ల్ జూలి ఆలియట్ బుధవారం పారిస్ ఆస్పత్రులో మరణించారు. కరోనా వైరస్‌తో ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
లండన్‌లో చెఫ్‌గా పని చేస్తోన్న 19 ఏళ్ల ఇటాలియన్ లుకా డీ నికోలా వైరస్ బారిన పడి మంగళవారం సాయంత్రం మరణించారు. అంతకుముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా యువకుడని, ఆయనేం కాదంటూ డాక్టర్ బరోసా ఇచ్చినప్పటికీ ఆ యువకుడిని మృత్యువు కబళించింది. ఆయన లండన్‌లోని ఎన్‌ఫీల్డ్‌లో తల్లి క్లారిస్సా, పార్ట్‌నర్ విన్‌సెంజోతో కలిసి ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం లుకా డీ నికోలా అంతకుముందు వారం రోజులుగా దగ్గూ జ్వరంతో బాధ పడుతున్నారు. స్థానిక డాక్టర్ వద్దకు వెళ్లగా ‘పారసిటమాల్’ ట్యాబెట్లు ఇచ్చి పంపించారు. దగ్గు తగ్గక పోవడంతో కరోనా వైరస్‌గా భావించిన కుటుంబ సభ్యులు స్థానిక వైద్యుడిని ఇంటికి పిలిపించి మళ్లీ చూపించారు. యవ్వనంలో ఉండడం వల్ల, ఇతర అనారోగ్య సమస్యలు ఏమీ లేదనందున కరోనాకు భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ భరోసా ఇచ్చిన రోజు సాయంత్రమే ఆయన మరణించారు. ఆ తర్వాత కరోనాతోనే ఆయన మరణించినట్లు వైద్యాధికారులు ధ్రువీకరించారు. (చదవండి: కరోనా చికిత్సకు కొత్త పరికరం)
Comments
Please login to add a commentAdd a comment